ఇక్కడంతా ఇల్లీగల్​ ఇసుక.. అఫీషియల్ రీచ్​లకు తగ్గిన గిరాకీ

ఇక్కడంతా ఇల్లీగల్​ ఇసుక.. అఫీషియల్  రీచ్​లకు తగ్గిన గిరాకీ
  •     అఫీషియల్  రీచ్​లకు తగ్గిన గిరాకీ
  •     తుంగభద్ర తీర పల్లెల్లో ఎక్కడ చూసినా డంపులే
  •     ఓటీపీలను సక్సెస్  చేయకుండా దందా
  •     మాఫియాకు సపోర్ట్  చేస్తున్న పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు

గద్వాల, వెలుగు : ఇసుక మాఫియాకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తుంగభద్ర నది పరిధిలోని అఫీషియల్  రీచ్‌‌లకు గిరాకీ తగ్గించి ఇల్లీగల్ రీచ్ ల నుంచి జోరుగా ఇసుకను రవాణా చేస్తున్నారు. గతంలో ఒక్కో రీచ్ లో 100 నుంచి 200 వరకు బుకింగ్ లు రాగా, ఇప్పుడు 30 నుంచి 40కి తగ్గిపోయాయి. దీంతో జిల్లాలో గతంలో ‘మన ఇసుక మన వాహనం’ ట్రాక్టర్లు 650 వరకు ఉండగా, ఇప్పుడు 150 నుంచి 200 మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కలు ఇల్లీగల్  దందా ఎలా చేస్తున్నారో చెబుతున్నాయి.  రాత్రి సమయాల్లో ఎడ్లబండ్లు, బొలేరోలు, ట్రాక్టర్లలో ఇసుకను తీసుకొచ్చి సమీప గ్రామాల్లో డంప్  చేసి, అక్కడి నుంచి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీస్​ ఆఫీసర్లకు నెలవారీగా మామూళ్లు ఇస్తుండడంతో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అక్కడక్కడ ఇసుక డంపులు సీజ్  చేస్తున్నా తెల్లారే సరికి మాయమవుతున్నాయి. 

ఓటీపీ మాయ..

జిల్లాలో తుంగభద్ర నదీ తీరంలో అఫీషియల్ గా పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ, వేణి సోంపూర్, అలంపూర్, తూర్పు గార్లపాడు, మెన్నిపాడు గ్రామాల్లో ఇసుక రీచ్ లు ఉన్నాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ఇసుక అన్ లోడ్  చేశాక ట్రాక్టర్ ఓనర్ కు ఓటీపీ వస్తుంది. దీన్ని సక్సెస్  చేయకుండా అలాగే పెట్టుకొని ఇల్లీగల్  రీచ్  దగ్గరికి వెళ్లి మరో ట్రిప్​ లోడ్ చేసుకొని దగ్గరలో ఉన్న గ్రామాల్లో డంప్​ చేస్తున్నారు. ఇలా దగ్గర గ్రామాలకు బుకింగ్  చేసుకొని ఒకే ఓటీపీతో రెండు, మూడు లోడ్లు ఇల్లీగల్ గా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

వేణి సోంపూర్ లో బుకింగ్స్​ అన్నీ బ్రోకర్ల పేర్లపైనే..

అయిజ మండలం వేణి సోంపూర్  రీచ్ కు బుకింగ్ అయ్యే ప్రతి వెహికల్​ బ్రోకర్ల పేరుపైనే ఉండడం అనుమానాలకు తావిస్తోంది. నెల రోజుల నుంచి అక్కడ బుకింగ్  అయిన పేర్లు గమనిస్తే ఈ వ్యవహారం తెలిసిపోతుంది. గద్వాల మైనింగ్  ఆఫీస్​లో పని చేసే ఒక ఉద్యోగి తన సొంత ఆన్ లైన్  సెంటర్ ద్వారా ఈ తతంగాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మాన్ దొడ్డిలో ఇల్లీగల్​ రీచ్..

జిల్లాలో గతంలో 5 అఫీషియల్ ఇసుక రీచ్ లు ఉండేవి. ఇటీవల మెన్నిపాడు ఇసుక రీచ్ ను ఓపెన్ చేశారు. కానీ రాజోలి మండలం మాన్ దొడ్డి దగ్గర ఇల్లీగల్ గా రీచ్ ను ఓపెన్ చేసి ఇసుక దందా కొనసాగిస్తున్నారు. దీనికి పోలీస్, రెవెన్యూ, పొలిటికల్, మైనింగ్ ఆఫీసర్ల నుంచి ఫుల్​ సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడడం లేదని అంటున్నారు. అలంపూర్ చౌరస్తా, ఎర్రవల్లి చౌరస్తా, రాజోలి, గద్వాలకు చెందిన ఇసుక మాఫియా అందరినీ మేనేజ్ చేస్తున్నారని చెబుతున్నారు. అఫీషియల్  రీచ్ ల కంటే ఎక్కువగా మాన్​దొడ్డి నుంచి ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

బండి కో రేట్..

రాజోలి, వడ్డేపల్లి  మండలాల పరిధిలోని తుంగభద్ర నదిలో ఇసుకను తోడేస్తున్న బండ్లకు పోలీసులు రేటు ఫిక్స్  చేస్తున్నట్లు తెలుస్తోంది. లేబర్‌‌‌‌తో ఇసుక తరలించే ట్రాక్టర్‌‌‌‌కు నెలకు రూ.10 వేలు, బొలెరోకు రూ.10వేలు, నదిలోకి జేసీబీ, ప్రొక్లైన్లను దింపి ఇసుకను తోడేస్తే ఒక్కో ట్రాక్టర్‌‌‌‌కు ప్రతి రోజూ రూ. 6 వేలు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.  ప్రస్తుతం 30 ట్రాక్టర్లు, 20 బొలెరోలు, వందల ఎడ్ల బండ్లు నడుస్తున్నాయి. ఈ లెక్కన పోలీసులకు ఎంత ముడుతుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే మాఫియా ఒకటి, రెండు ట్రిప్పుల డబ్బులు పోలీసులకు ఇచ్చి, 30 ట్రిప్పుల వరకు ఇసుక తరలిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రాక్టర్  ఇసుకను రూ.6 వేల నుంచి రూ.8 వేలు, టిప్పర్ ఇసుక రూ. 40 వేల వరకు అమ్ముడుపోతోంది. రాజోలి, శాంతినగర్, ఉండవెల్లి మండలాల పరిధిలోని 10 గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇసుక డంపులే కనిపిస్తున్నాయి. స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ ఇసుక డంప్​ను సీజ్  చేస్తే తెల్లారేసరికి మాయం చేసేస్తున్నారు. ఇలా తూర్పు గార్లపాడు, ధన్వాడ, రాజోలి, తుమ్మిళ్ల గ్రామాల్లో సీజ్ చేసిన ఇసుక డంప్​లు మాయమయ్యాయి. 

ఇల్లీగల్  రీచ్  గురించి తెలియదు..

మాన్ దొడ్డి ఇల్లీగల్  ఇసుక రీచ్  మా దృష్టికి రాలేదు. దీనిపై దృష్టి పెడతాం. ఆఫీషియల్  రీచ్ లకు గిరాకీ తగ్గిన మాట వాస్తవమే. ఓకే ఓటీపీతో రెండు, మూడు సార్లు ఇసుక తరలిస్తున్న తతంగంపై ఎంక్వైరీ చేస్తాం. ఇల్లీగల్  ఇసుక వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం.   

- విజయరామరాజు, మైనింగ్  ఏడీ