బార్డర్​ దాటుతున్న ఇసుక.. కాంట్రాక్టర్, ఆఫీసర్ల కుమ్మక్కు

బార్డర్​ దాటుతున్న ఇసుక.. కాంట్రాక్టర్, ఆఫీసర్ల కుమ్మక్కు

మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డు లేకుండాపోయింది. కాంట్రాక్టర్లు, మైనింగ్​ అఫీసర్లు కలిసి ఇసుకను కర్నాటక రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని మక్తల్​ నియోజకవర్గంలో ప్రభుత్వం రెండు ఇసుక రీచ్​లకు అనుమతి ఇచ్చింది. మాగనూర్​ మండలం వర్కూర్​ వాగుతో పాటు ఊట్కూర్​ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ వాగులో ఇసుక రీచ్​లను ఏర్పాటు చేశారు.

మాగనూర్​ మండలంలోని ఇసుక రీచ్​ వద్ద మైనింగ్​ అఫీసర్​ను, ఊట్కూర్​ మండలంలోని ఇసుక రీచ్​ వద్ద వీఆర్ఏను ఉంచి ఇసుకను పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. బార్డర్ లో ఉన్న గ్రామాలకు ఆన్​లైన్​లో ఇసుకను బుక్  చేసుకున్న రీచ్​ కాంట్రాక్టర్, టిప్పర్ల ఓనర్లు  కర్నాటకకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. 

చేగుంట గ్రామం పేరుతో పర్మిషన్లు..

ప్రభుత్వ పనులకు, గృహ నిర్మాణ అవసరాలకు జిల్లా పరిధిలో ఆన్​లైన్ ద్వారా ఇసుక తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతి ఇస్తున్నారు. అయితే కృష్ణ మండలం చేగుంట గ్రామం పేరుతో ఇసుక బుక్  చేసుకొని, కర్నాటకకు తరలిస్తున్నారు. ఆన్​లైన్​లో ఓ టిప్పర్​ ఇసుకకు  రూ.20 వేలు చెల్లించి, కర్నాటకలో రూ.30 వేలకు అమ్ముకుంటున్నారు. కొన్ని వారాలుగా దందా జరుగుతున్నా మైనింగ్, పోలీస్ ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతి రోజు 20 టిప్పర్ల వరకు ఇలా ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఆఫీసర్లు, లీడర్ల అండదండలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

కాగా శుక్రవారం సాయంత్రం మాగనూర్​ మండలం వర్కూర్​ ఇసుక రీచ్​ నుంచి ఇసుక లోడ్​తో కర్నాటక రాష్ట్రంలోని కడేచూర్​లోని ఓఇండస్ట్రీకి వెళ్తున్న 3 టిప్పర్లను గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులకు ఓ బీఆర్ఎస్​ లీడర్, రీచ్​ కాంట్రాక్టర్​ ఫోన్​ చేసి కేసులు పెట్టవద్దని చెప్పినట్లు సమాచారం. విషయం మీడియాకు తెలియడంతో కేసులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. 

ALSO READ :గురుకుల స్టూడెంట్​కు పాముకాటు

వీఆర్ఏపై సస్పెన్షన్​ వేటు..

ఊట్కూర్ మండలం నాగిరెడ్డిపల్లి ఇసుక రీచ్  వద్ద పెద్దపొర్ల వీఆర్ఏ తిరుపతిని నియమించారు. కాగా, ఊట్కూర్ మండల కేంద్రానికి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సమస్థాపూర్  గ్రామానికి తీసుకెళ్తుండగా ఆర్ఐ రాఘవేందర్  పట్టుకున్నారు. విషయాన్ని తిరుపతయ్య దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్  శ్రీహర్ష దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు వీఆర్ఏ తిరుపతిపై సస్పెన్షన్​ వేటు వేశారు.

ఇదిలాఉంటే ఆన్​లైన్​ విధానం అక్రమార్కులకు వరంగా మారిందని ప్రజలు పేర్కొంటున్నారు. టిప్పర్​ ఓనర్లు ఫేక్​ వ్యక్తుల పేరుతో ఇసుక బుక్​ చేసుకొని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

కర్నాటకకు తరలుతున్న మాట వాస్తవమే..

జిల్లాలో బుకింగ్స్  లేకపోవడంతో బార్డర్  విలేజ్​ పేరుతో బుక్ చేసుకుని కర్నాటకకు ఇసుక తరలిస్తున్న మాట వాస్తవమే. ఓ జిల్లా అధికారి ఆదేశాల మేరకే ఇసుకను కర్నాటకకు తీసుకెళ్తున్నారు. 

- రమేశ్, మైనింగ్​ ఆర్ఐ