తెలంగాణ సాధన కోసం తుదివరకు పోరాడిన సంగం రెడ్డి

తెలంగాణ సాధన కోసం తుదివరకు పోరాడిన సంగం రెడ్డి

తెలంగాణ సాధనే జీవిత ఆశయంగా తుదివరకు పోరాడిన వ్యక్తి సంగం రెడ్డి సత్యనారాయణ. కవి, గాయకుడు, జర్నలిస్ట్, మాజీ మంత్రిగా వివిధ బాధ్యతలు నెరవేరుస్తూనే తెలంగాణ కోసం విశేషంగా కృషి చేశారు. ఆయన రాసిన, పాడిన పాటలు ప్రజలను చైతన్యం చేశాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, వివక్ష ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపించేవి. వివక్ష గురించి సత్యనారాయణ రాసిన ‘‘మా పెంట మీదా కోడి మీకు వంటయినప్పుడు, మేము అంటరానోళ్లం ఎట్లయితం’’ అని దళిత బహుజనులు ఎదుర్కొన్న వివక్షను ముక్కుసూటిగా ప్రశ్నించారు. వరంగల్​జిల్లా ముచ్చర్లలో1933 జనవరి1న సంగంరెడ్డి నర్సయ్య, నర్సమ్మ దంపతులకు జన్మించిన ఆయన ఊరు పేరే.. ఇంటి పేరుగా స్థిరపడింది. 

పాటలు కైగడుతూ..

ముచ్చర్ల తెలంగాణ కోసం 5 దశాబ్దాల పాటు పోరాటం చేశారు.1969-–72 ఉద్యమ కాలంలోనే ఆయన తన మోటార్​సైకిల్​పై రోజుకు 200 కిలో మీటర్లు విస్తృతంగా తిరిగేవారు. ఆయన ప్రజలను చైతన్యం చేసేందుకు ‘జై తెలంగాణ’ పత్రిక నడుపుతూ వాటిని ఉచితంగా పంచేవారు. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి తెలంగాణ వ్యతిరేక చర్యలను ఎండగడుతూ ‘‘అయ్యయ్యో.. రామరామ.. సంజీవరెడ్డి మామా ఊడుద్ది నీ పైజామా’’ అని ధైర్యంగా నిలదీసిన ధీశాలి సత్యనారాయణ. వరంగల్ లో ఆంధ్రాకు చెందిన రత్తమ్మ హోటల్ పై ఆయన రాసిన పాట పేరుగాంచింది. ‘‘ రత్తమ్మా.. రత్తమ్మా నీ దుకాణం ఎత్తమ్మ’’ అని ప్రశ్నించాడు. ఇక్కడికి వలస వచ్చి తెలంగాణ యాసను, భాషను, సంస్కృతిని అవమాన పరుస్తూ, ఆధిపత్యం చేలాయిస్తుండటాన్ని ఆయన సహించలేదు. ముచ్చర్ల తన పాటలతో ప్రజలను మెప్పించాడు. అప్పట్లో కౌలు రైతులు భూమి హక్కు కోసం ధర్నాలు, ఊరేగింపులు చేస్తున్న ఘటనలు అతడిలోని కళాకారుడిని తట్టిలేపాయి. ఆ సన్నివేశాలతో ముచ్చర్ల బుర్రకథ రాశాడు. దాన్ని ప్రదర్శించి దొరల ఆగ్రహానికి గురయ్యాడు. ఆయన వేసే నాటకాల్లో తన ప్రియమిత్రుడైన ప్రొఫెసర్ జయ శంకర్ స్త్రీ పాత్రలు వేసేవాడు. చరమాంకం వరకు ఇద్దరు మిత్రులుగానే కొనసాగారు. 

నాన్​ ముల్కీ ఉద్యమంలో..

వరంగల్ లో సత్యనారాయణ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాన్ ముల్కి ఉద్యమం తీవ్రమైంది. వరంగలో విస్తరించిన ఈ ఉద్యమం సెగలు హైదరాబాదుకు తాకాయి. వరంగల్ వచ్చిన ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుని ఘెరావ్​ చేశారు. ముచ్చర్ల ఆ ఉద్యమానికి విద్యార్థి నాయకుడిగానాయకత్వం వహించారు. 1962 తెలంగాణ ఉద్యమంలోకి రాజకీయ నాయకులు రావాలని ‘‘రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి’’ అనే మకుటంతో రాసిన పాట ఆలోచింపజేసింది. చివరకు 1969 మే 22న మర్రి చెన్నారెడ్డి టీపీఎస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్నప్పుడు ముచ్చర్ల అంగీకరించలేదు. చెన్నారెడ్డిని డైరెక్ట్​గా విమర్శించాడు. ఆయన పాటలు, విమర్శలు చెన్నారెడ్డి లాంటి నాయకులకు కంటగింపులయ్యాయి. ఆయనను పక్కన బెట్టారు. 

రవాణా శాఖ మంత్రిగా..

1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు తరువాత ముచ్చర్ల శక్తియుక్తుల గురించి ఎన్టీఆర్‌కు తెలిసి, హయగ్రీవాచారిని ఓడించే దమ్ము నీకే ఉందంటూ టీడీపీ తరఫున నిలబెట్టారు. తానే నాయకుడు, గాయకుడై ఒంటిచేత్తో ఎన్నికల సభలను ఉర్రూతలూగించి గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ముందే ముచ్చర్ల సభలు, సమావేశాలు నిర్వహించాడు. ఆ సమయం లోనే జయశంకర్ సార్ ద్వారా కేసీఆర్ పలుమార్లు ముచ్చర్లను పిలిపించుకొని మాట్లాడారు. కరీంనగర్ సభలో ముచ్చర్లను వేదికపైకి ఆహ్వానించాలంటూ అనేక మంది నాయకులు డిమాండ్ చేయడం, చివరకు ఆయన వేదిక పైకి రావడం, అనేక కొత్త పాటలు పాడుతూ, అనర్గళంగా ప్రసంగించి జనాన్ని ఉర్రూత లూగించడం విస్మరించలేని వాస్తవాలు. ప్రజానాయకుడిగా పల్లెగుండెల్లో, తెలంగాణ ప్రాంతంలో చెరగని ముద్ర వేసుకున్నారు సత్యనారాయణ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆశయ సాధనే ఆశగా, శ్వాసగా జీవించారు ఆయన. అక్టోబర్10న జరగాల్సిన ఆయన వర్ధంతి సభ దసరా పండుగ వల్ల16న వరంగల్ లో నిర్వహిస్తున్నారు.

- సాధం వెంకట్,
సీనియర్ జర్నలిస్ట్