జిన్ పింగ్ ఎక్కడ? కొన్ని వారాలుగా బయట కనిపించని చైనా అధ్యక్షుడు !

జిన్ పింగ్ ఎక్కడ? కొన్ని వారాలుగా బయట కనిపించని చైనా అధ్యక్షుడు !
  • మే 21 నుంచి ఇప్పటి దాకా రెండు సార్లే బయటికి..
  • అది కూడా కేవలం వీడియోల్లోనే ప్రత్యక్షం
  • బ్రిక్స్ సదస్సుకు దూరం
  • అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ టైమ్ సమిట్​కు గైర్హాజరు
  • పదవి నుంచి తప్పుకుంటున్నారని వార్తలు.. వాంగ్ యాంగ్​కు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం

బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ గత కొన్ని రోజులుగా బయట ఎక్కడా కనిపించడం లేదు. పబ్లిక్ మీటింగ్స్, స్టేట్ మీడియా ముందుకు రావడం లేదు. డిప్లామాటిక్ ఈవెంట్స్​కు దూరంగా ఉన్నారు. బ్రిక్స్ సదస్సుకూ హాజరు కాలేదు. 2013లో ఆయన అధికారంలోకి వచ్చాక.. బ్రిక్స్ సమిట్​కు హాజరుకాకపోవడం ఇదే తొలిసారి. తొలుత మే 21 నుంచి జూన్‌‌‌‌ 5 వరకు జిన్​పింగ్ కనిపించకుండా పోయారు. 

చైనా అధ్యక్షుడు ఇలా కనిపించకుండా పోవడం నాయకత్వ మార్పునకు సంకేతమని అక్కడి నిఘా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, జిన్​పింగ్ అజ్ఞాతంలోకి వెళ్లడం సాధారణమని పలువురు అధికారులు చెబుతున్నారు. చైనా అధికారిక మీడియాలో నిత్యం కనిపించే జిన్‌‌పింగ్.. ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఏడాదిలో మూడో సారి..
జూన్ 4 నుంచి ఇప్పటి దాకా అక్కడి మీడియా రిలీజ్ చేసిన వీడియోల్లో జిన్​పింగ్ 2 సార్లు మాత్రమే కనిపించారు. జూన్ 20న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌‌తో జిన్ పింగ్ సమావేశం అయ్యారు. జూన్ 24న సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌‌తోనూ ఆయన చర్చలు జరిపారు. ఆ తర్వాత నుంచి జిన్​పింగ్ ఎక్కడా కనిపించ లేదు. దీనికి ముందు జూన్ 4 నుంచి ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు.

ఆ రోజు జోంగ్నాన్​హైలో బెలారస్​ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో జిన్​పింగ్ భేటీ అయ్యారు. దీంతో బ్రిక్స్ సమిట్​కు హాజరవుతారని భావించినా కానీ.. జిన్​పింగ్ అటెండ్ కాలేదు. టైట్ షెడ్యూల్ వల్లే బ్రిక్స్ సమిట్​కు జిన్​పింగ్ హాజరుకావడంలేదని చైనా అధికారిక మీడియా ప్రకటించింది. ఇలా కొన్ని వారాల పాటు జిన్​పింగ్ కనిపించకుండాపోవడం ఏడాదిలో ఇది మూడోసారి.

కొనసాగుతున్న అధికారాల అప్పగింతలు!
12 ఏండ్ల పాలన తర్వాత అధికారాలను ఒక్కొక్కటిగా ఆయన తదుపరి నేతలకు అప్పగిస్తున్నట్లు సమాచారం. పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో కూడా అధ్యక్షులు మారినప్పుడు అంతకుముందు ఉన్నవాళ్లు కొన్ని రోజులుగా కనిపించలేదని నిఘా సంస్థలు చెప్తున్నాయి. జిన్‌‌పింగ్‌‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో సంస్కరణలకు మద్దతు తెలిపే టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్‌‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించవచ్చనే ప్రచారం జోరుగా సాగుతున్నది.

24 మందితో కూడిన అధికార చైనా కమ్యూనిస్ట్‌‌ పార్టీ (సీపీసీ) పొలిటికల్‌‌ బ్యూరో జూన్‌‌ 30న సమావేశమైంది. పార్టీలోని వివిధ సంస్థల పనుల నిబంధనలను సమీక్షించింది. ఆయా సంస్థలు ప్రభావవంతమైన నాయకత్వాన్ని, సమన్వయాన్ని ప్రదర్శించాలని, కీలక పనుల ప్రణాళికతో పాటు చర్చించడం, పర్యవేక్షించడంపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ విషయాలన్నీ అధికారిక మీడియా జిన్హువా తెలిపింది. దీంతో అధికార మార్పిడి జరుగుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి.

జీవితకాలం అధ్యక్షుడిగా ఉండేందుకు సవరణలు
జిన్‌‌పింగ్‌‌ కావాలనే కొన్ని బాధ్యతలను సహచరులకు అప్పగిస్తున్నారని, కీలక సమస్యలపై దృష్టి పెట్టడానికి ఆయనిలా చేస్తున్నారని పలువురు అభిప్రాయపడు తున్నారు. దీనికితోడు చైనాలో సైనిక ప్రక్షాళన జరుగుతున్నది. 2012లో సీపీసీ జనరల్‌‌ సెక్రటరీగా జిన్‌‌పింగ్‌‌ అధికారం చేపట్టాడు. పాలనలో తనదైన మార్క్​ చూపించాడు. తనను తాను పార్టీ ‘ముఖ్య నాయకుడు’గా ప్రకటించుకున్నాడు. మావో తర్వాత ఈ హోదాను దక్కించుకున్నది జిన్‌‌పింగ్‌‌ మాత్రమే. అధికారంలో ఉండేందుకు ఏకంగా పార్టీ రాజ్యాంగాన్నే మార్చేశాడు.

జీవిత కాలం పాటూ అధికారాన్ని చెలాయించేలా సవరణలు చేశాడు. 2022లో పార్టీ జనరల్‌‌ సెక్రటరీగా, 2023లో అధ్యక్షుడి గా మూడోసారి కొనసాగారు. కాగా, చైనా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. నిరుద్యోగం పెరుగుతోంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. ఇలాంటి సంక్షోభాల మధ్య జిన్‌‌పింగ్ నాయకత్వంపై ప్రజలు, వ్యాపారవర్గాల్లో ఆందోళన నెలకొన్నది.