సంగారెడ్డి బీఆర్ఎస్  లో..చింతా వర్సెస్ పట్నం 

సంగారెడ్డి బీఆర్ఎస్  లో..చింతా వర్సెస్ పట్నం 
  • బలప్రదర్శనకు దిగుతున్న ప్రత్యర్థి వర్గాలు.. రచ్చకెక్కుతున్న గ్రూప్​ రాజకీయాలు  

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి బీఆర్ఎస్ లో చింతా వర్సెస్​ పట్నంగా మారింది. సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, డీసీసీబీ  వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం అనుచరులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఇప్పటికే సంగారెడ్డి నియోజకవర్గం బీఆర్ఎస్ టికెట్ చింతా ప్రభాకర్​కు ప్రకటించగా, టికెట్​ ఆశించిన మాణిక్యంకు నిరాశ ఎదురైంది. దీంతో ఆయన  కొన్ని రోజులుగా బల ప్రదర్శనకు దిగుతూ సొంత పార్టీ నేతలకే గుబులు పుట్టిస్తున్నారు.

ఈనెల 3న మాణిక్యం నియోజకవర్గంలోని మద్దతుదారులు, ముదిరాజ్ సంఘం నేతలతో భారీ సభ ఏర్పాటు చేసి పార్టీ హైకమాండ్​కు తన బలాన్ని చూపించుకున్నారు. అయితే చింతా వర్గం రెండు రోజులుగా మాణిక్యం వర్గీయులపై వాట్సప్ గ్రూపులో పోస్టులు పెడుతున్నారు. విమర్శలు ప్రతి విమర్శలతో పార్టీలోని గ్రూప్​ రాజకీయాలు బహిర్గతమవుతున్నాయి. 

వాళ్లంతా ఒక్కటవుతున్రు.. 

రోజురోజుకూ చింతా ప్రభాకర్ కు నియోజకవర్గంలో వ్యతిరేకుల సంఖ్య పెరుగుతోంది. పట్నం మాణిక్యం రూపంలో ఇప్పటికే సొంత పార్టీ లీడర్లు రచ్చ చేస్తుండగా, తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై ‘ఉద్యమకారుల వేదిక’ పేరుతో చింతాకు వ్యతిరేకంగా ఈనెల 10న సదస్సు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. సదాశివపేటకు చెందిన ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు కూడా చింతా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 11న పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోపక్క బీఆర్ఎస్ లీడర్ ఆత్మకూర్ నగేశ్ కూడా చింత వ్యతిరేకులతో చేయి కలుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరంతా ఒక్కటై బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

మాణిక్యంపై ఫిర్యాదు?

పట్నం మాణిక్యం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వెళ్తున్నాడని నియోజకవర్గ లీడర్లు ఈనెల 6న మంత్రి హరీశ్​రావుకు ఫిర్యాదు చేయనున్నట్టు చింతా అనుచరులు చెబుతున్నారు. ఆయనకు నచ్చజెప్పడమో, వినకపోతే తగిన చర్యలు తీసుకోవడమో జరుగుతుందని పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. కాగా మాణిక్యం వర్గీయులు మాత్రం క్రమశిక్షణ చర్యలను లెక్కచేయబోమని, అవసరమైతే మరో పార్టీ నుంచి పోటీ చేయించి గెలిపించుకుంటామనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే మాణిక్యం కూడా మొన్న జరిగిన సభలో ఈనెల 22న తన పుట్టినరోజు సందర్భంగా రాజకీయ భవిష్యత్తు ప్రకటిస్తానని వెల్లడించడం ఆసక్తి కలిగిస్తోంది. ఏదేమైనా బీఆర్​ఎస్​ లీడర్ల పరస్పర విమర్శలతో నియోజకవర్గంలో రోజురోజుకూ పొలిటికల్​ హీట్​ పెరుగుతోంది.