
సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో పోడు భూములకు సంబంధించి ప్రక్రియ అంతా 4లోగా పూర్తి కావాలని సంబంధిత అధికారులను సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులతో పోడు పట్టాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు పట్టాల పంపిణీలో అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించాలని సూచించారు. ఆర్ఓఎఫ్ ఆర్ యాక్ట్ ప్రకారం గిరిజనులకు సంబంధించి రెండు రుజువులు ఉంటే సరిపోతుందని తెలిపారు. సబ్ డివిజనల్ స్థాయి కమిటీ (ఎస్ డీ ఎల్ సీ)లో తిరస్కరించిన దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, తిరస్కరణకు కారణాలు స్పష్టంగా పేర్కొన్నాలని చెప్పారు. ఈనెల3లోగా పోడు పట్టాల ప్రింటింగ్ పూర్తి కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫిరంగి, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ రావు, డీపీవో సురేశ్ మోహన్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు ఫారెస్ట్ రేంజ్ అధికారులు, ఎంపీ ఓలు పాల్గొన్నారు.
బియ్యం సక్రమంగా సరఫరా చేయాలి
రేషన్ బియ్యం స్టేజ్ వన్, స్టేజ్ టు కాంట్రాక్టర్లకు టైమ్లోగా సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శరత్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఎప్పటికప్పుడు రేషన్ బియ్యం పర్యవేక్షణ చేస్తూ రిపోర్టులు ఇవ్వాలన్నారు. రేషన్ షాప్ ల వద్ద ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని, ధరల వివరాలు, స్టాప్ వివరాలు నేమ్ బోర్డు ప్రదర్శించాలని చెప్పారు. మూడు నెలలకోసారి జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా, అంగన్వాడీలో వినియోగిస్తున్న తీరును మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి పద్మావతి వివరించారు. అనంతరం కలెక్టర్వైద్య ఆరోగ్య అనుబంధ శాఖలతో కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్షించారు. కంటి వెలుగు కార్యక్రమంలో కంటి సమస్యలు ఉన్నవారు వందశాతం కవర్ అయ్యేలా రోజువారీ షెడ్యూల్ వేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోజూ కనీసం 200 మందికి స్క్రీనింగ్ చేయాలన్నారు. కోర్టు, జైలు, చక్కర కర్మాగారాలు, తదితర ప్రాంతాలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని డీఎం హెచ్ ఓకు
సూచించారు.