
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్ లో నిర్వహించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫొటో ఉండడంతో ఆ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసు వల్ల తాను కాంగ్రెస్ లో లేనని సుప్రీంకోర్టులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అఫిడవిట్ ను సమర్పించిన సంగతిని గుర్తుచేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు మహిపాల్ రెడ్డి స్థానంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫొటోను పెట్టారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కమిటీల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని జహీరాబాద్ఇన్చార్జి ఆగం చంద్రశేఖర్ సమావేశం దృష్టికి తెచ్చారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుంటూ అలాంటి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని సర్ది చెప్పారు. పటాన్చెరు ఇందిరమ్మ కమిటీల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెత్తనం స్పష్టంగా కనిపిస్తుందంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ నాయకులకు న్యాయం చేసి కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుందన్నారు.
కాంగ్రెస్ బలం, బలహీనత స్వేచ్ఛ అన్నారు. కాంగ్రెస్‌లో గొడవలు సాధారణమైనవే అయినప్పటికీ సమష్టిగా పనిచేస్తే నారాయణఖేడ్ లో ఎంపీగా సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యేగా సంజీవరెడ్డి గెలుపు సాధ్యమైందని వివరించారు. రాజకీయాల్లో విభేదాలున్నా పార్టీకి నష్టం జరిగేలా ఉండొద్దని హితవు పలికారు. కాంగ్రెస్ తీసుకున్న కుల గణన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సమావేశంలో ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్, నీలం మధు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యకర్తలే కాంగ్రెస్ కు ఆయువుపట్టు : నీలం మధు
పటాన్చెరు: కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి ఆయువుపట్టని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. ఆదివారం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హోటల్లో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అన్ని వర్గాలకున్యాయం చేస్తూ సంక్షేమ పథకాల అమలు చేస్తోందని తెలిపారు. తెలంగాణలో చేపట్టిన బీసీ కులగణనను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టేలా కేంద్ర నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారు.