సంగారెడ్డి జైలు ఫుల్​టైట్

సంగారెడ్డి జైలు ఫుల్​టైట్
  • కెపాసిటీ 387.. ఉన్నది 700 మంది ఖైదీలు
  • ఇద్దరిని ఉంచాల్సిన చోట నలుగురు
  • సైబర్ క్రైమ్ నేరస్తులతోపాటు మందుబాబులూ ఇక్కడే

సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జైలుకు రోజురోజుకు ఖైదీల తాకిడి పెరుగుతోంది. దీంతో ఇద్దరిని ఉంచాల్సిన చోట నలుగురిని ఉంచుతున్నారు. ఇంతకాలం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితమైన ఈ జైలుకు ఇప్పుడు సైబర్ క్రైమ్ పరిధిలోని ఖైదీలను కూడా తరలిస్తుండడం సమస్యగా మారింది. సంగారెడ్డి జిల్లా కందిలోని జిల్లా కారాగారాన్ని మూడు నెలల క్రితం ప్రభుత్వం సెంట్రల్ జైలుగా అప్ గ్రేడ్ చేసింది. అప్పటినుంచి ఈ జైలుకు రోజువారీ ఖైదీల తాకిడి పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ అండర్ ట్రయల్ ఖైదీలతోపాటు నగరంలో పట్టుబడిన మందుబాబులను కూడా ఇక్కడికే తీసుకొస్తున్నారు. జైలును అప్​గ్రేడ్​చేసిన ప్రభుత్వం అందుకు తగ్గ సౌకర్యాలు మాత్రం కల్పించలేదు. దీంతో ఖైదీలతో పాటు అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జైలులో 387 మంది ఖైదీలు మాత్రమే ఉండేందుకు సౌకర్యాలు ఉండగా ప్రస్తుతం 700 మంది ఉంటున్నారు. 

వరంగల్ ఎఫెక్ట్ తో..

వరంగల్ లోని సెంట్రల్ జైలును ఆస్పత్రి నిర్మాణం కోసం కూల్చివేయడంతో అక్కడి ఖైదీలను చర్లపల్లి, చంచల్ గూడ జైళ్లకు తరలించారు. దీంతో చర్లపల్లి, చంచల్​గూడ కారాగారాలకు తరలించాల్సిన ఖైదీలను నగరానికి సమీపంలో ఉన్న సంగారెడ్డి జైలుకు తరలిస్తుండడంతో ఇక్కడ ఒత్తిడి పెరిగింది. సంగారెడ్డి జైలులో మొత్తం 387 మంది ఖైదీలను ఉంచేందుకు వసతులు ఉండగా, 40 మంది మహిళా ఖైదీలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అయితే కెపాసిటీకి మించి ఖైదీలను ఉంచాల్సి వస్తోందని జైలు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సంగారెడ్డి జైలులో అండర్ ట్రయల్​ఖైదీలు 534 మంది, 35 మంది మహిళలు ఉండగా శిక్ష పడినవారు 72 మంది ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులను సంగారెడ్డి జైలుకే తరలిస్తున్నారు. అలా తరలించినవారికి ఒక రోజు నుంచి రెండు వారాల వరకు తీవ్రతను బట్టి శిక్ష పడుతుంటుంది. శిక్ష పడిన మందుబాబులు రోజుకు దాదాపు 20 నుంచి 30 మంది వరకు సంగారెడ్డి జైలుకు వస్తున్నారు. వీరితో గార్డెనింగ్, కూరగాయలు, నర్సరీ ఇతరత్రా పనులు చేయిస్తున్నారు. మరోవైపు సైబర్ నేరాలకు పాల్పడినవారిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి ఈ జైలుకే తీసుకొస్తున్నారు. అలాంటివారు సుమారు 90 మంది ఇక్కడ అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నట్టు తెలిసింది. వీరిలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ ఒడిశా, ఢిల్లీ రాష్ట్రాలకు చెందినవారున్నారు.

మోడల్ జైలులో సమస్యలు

రాష్ట్రంలోనే సంగారెడ్డి జైలు మోడల్ జైలుగా గుర్తింపు పొందింది. ఇక్కడ శిక్ష అనుభవించిన ఖైదీలు జైల్లో తయారు చేసిన వివిధ వస్తువులతోపాటు వివిధ రంగాల్లో వారి వ్యక్తిగత నైపుణ్యం అందరినీ ఆకట్టుకునేది. జైలు అధికారుల పర్యవేక్షణ కూడా అదే స్థాయిలో ఉండడంతో మోడల్ జైలుగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం సామర్థ్యానికి మించి ఇక్కడ ఖైదీలు ఉండడం వల్ల రోజురోజుకు సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఖైదీలకు అవసరమైన సౌకర్యాలు కరవయ్యాయి. జిల్లా జైలును సెంట్రల్ జైలుగా అప్ గ్రేడ్ చేసినప్పటికీ అందుకు తగ్గ క్యాడర్ లేదు. ఎస్పీ స్థాయి క్యాడర్ ఉన్నవాళ్లు సూపరింటెండెంట్ గా ఉండాలి. ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, నలుగురు జైలర్లు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే గార్డెనింగ్ లో 80 నుంచి 100 మంది వరకు తీసుకోవాల్సి ఉంది.  ఖైదీల ఉపాధి కోసం జైలు లోపల ఫ్యాక్టరీ కూడా నిర్మించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అవేవీ లేకపోయినా ఇక్కడి జైలు అధికారులు ఎలాగోలా మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంగారెడ్డి జైలులో వసతులు పెంచాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.