
సిద్దిపేట, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభించనుంది. 15 జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం రూ.2.61 కోట్లను మంజూరు చేసింది. గతేడాది 11 కాలేజీలకు నిధులు మంజూరు చేయగా ఈ ఏడాది 15 కాలేజీలకు నిధులు మంజూరయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండగా ఫస్ట్ ఇయర్ లో 2345 మంది, సెకండ్ ఇయర్ లో 3200 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. జూనియర్ కాలేజీల్లో వసతులు కల్పించి భవిష్యత్లో ప్రవేశాల సంఖ్య పెంచే దిశగా ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 15 కాలేజీల్లో పనుల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది.
3 విభాగాలకు నిధుల వినియోగం
నిధులు మంజూరైన కాలేజీల్లో సివిల్, ఎలక్ట్రికల్, వాటర్, శానిటేషన్ వర్క్స్చేపట్టనున్నారు. మొత్తం నిధుల్లో రూ.1.14 కోట్లు సివిల్ వర్క్స్, రూ.19.16 లక్షలు ఎలక్ట్రికల్, రూ.12.60 లక్షలు తాగునీటి కోసం మిగిలిన నిధులను ఇతర అవసరాలకు వినియోగించనున్నారు. అవసరమైన చోట్ల బోర్ల ఏర్పాటు, ప్రహరీ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇంజనీరింగ్ అధికారుల ప్రతిపాదనతో కలెక్టర్ ఆమోదంతో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పనులను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి టెండర్లను ఆహ్వానించి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు.
పెండింగ్ లో బిల్లులు
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నిర్వహించిన పనులకు సంబంధించిన బిల్లులు కొంత మేర పెండింగ్ లో ఉన్నాయి. 2024 లో జిల్లాలోని 11 కాలేజీల్లో వివిధ రిపేర్ల కోసం రూ.92 లక్షలు మంజూరయ్యాయి. కొన్నిచోట్ల పనులు పూర్తవగా, మరికొన్ని చోట్ల పెండింగ్ లో ఉన్నాయి. వీటికి సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉండడంతో పనులపై ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తే మిగిలిన పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.
మౌలిక వసతుల కల్పనకు నిధుల వినియోగం
ప్రభుత్వం మంజూరు చేసిన 2.61 కోట్ల నిధులతో జిల్లాలో ఎంపిక చేసిన జూనియర్ కాలేజీల్లో అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తాం. సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ పనులను పూర్తి చేస్తాం. త్వరలోనే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల అధ్వర్యంలో టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తాం.
రవీందర్ రెడ్డి, డీఐఈవో, సిద్దిపేట
కాలేజీల వారీగా మంజూరైన నిధులు.. లక్షల్లో
జూనియర్ కాలేజీ, తొగుట రూ.26
జూనియర్ కాలేజీ బాయ్స్, సిద్దిపేట రూ.11.50
జూనియర్ కాలేజీ, కొండపాక రూ.20.50
జూనియర్ కాలేజీ, దౌల్తాబాద్ రూ.14.30
జూనియర్ కాలేజీ, దుబ్బాక రూ.13.50
జూనియర్ కాలేజీ, జగదేవ్ పూర్ రూ.37.50
జూనియర్ కాలేజీ, నంగునూరు రూ.19.00
జూనియర్ కాలేజీ, మిరుదొడ్డి రూ.15.30
జూనియర్ కాలేజీ, చిన్నకోడూరు రూ.16.30
జూనియర్ కాలేజీ, ములుగు రూ.26.00
జూనియర్ కాలేజీ, వర్గల్ రూ.10.30
జూనియర్ కాలేజీ గర్ల్స్, హుస్నాబాద్ రూ.12.90
జూనియర్ కాలేజీ బాయ్స్, హుస్నాబాద్ రూ.20.00
జూనియర్ కాలేజీ, కోహెడ రూ.15.00
జూనియర్ కాలేజీ, మద్దూరు రూ. 2 .95