గ‌వ‌ర్నర్ స‌ర్.. ఏం జ‌రుగుతోంది?

గ‌వ‌ర్నర్ స‌ర్.. ఏం జ‌రుగుతోంది?

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా కొత్త మంత్రివర్గం ఏర్పాటు జాప్యంపై  ఆయన మండిపడ్డారు.

"బార్బడోస్ దేశ జ‌నాభా 2.5 ల‌క్షలు ఉంటుంది. అయిన‌ప్పటికీ వారి కేబినెట్‌లో 27 మంది ఉన్నారు. మ‌హారాష్ట్ర జ‌నాభా 12 కోట్లు.  ఈ రాష్ట్ర కేబినెట్‌లో కేవ‌లం ఇద్దరు మాత్రమే ఉండి, ఏక‌ప‌క్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజ్యాంగానికి గౌరవం ఎక్కడ ఉంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (1-A) ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రుల సంఖ్య 12 కంటే తక్కువ ఉండకూడదు. గత 2 వారాలుగా, కేవలం ఇద్దరు  మంత్రులతో (ఏక్‌నాథ్ షిండే, ఫ‌డ్నవీస్‌)కూడిన కేబినెట్ రాజ్యాంగబద్ధంగా చెల్లని నిర్ణయాలను తీసుకుంటోంది.  గౌర‌వ‌నీయులైన గ‌వ‌ర్నర్ స‌ర్.. ఏం జ‌రుగుతోంది"  అంటూ ట్వీట్ చేశాడు.

తాజా ఊహాగానాల ప్రకారం  రాష్ట్రపతి ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరగవచ్చని తెలుస్తోంది.   అటు తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత వేటు పై  దాఖలైన పిటిషన్లను  భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించనుంది.