పల్లెబాట పట్టిన పట్నం వాసులు

పల్లెబాట పట్టిన పట్నం వాసులు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. పట్నం వాసులంతా పల్లెలకు పయనమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను ఖాళీ చేసి సొంతూర్లకు వెళ్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి నిర్వహించుకునేందుకు పల్లెబాట పట్టారు. దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో బస్సుల్లోనే ప్రయాణించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. 

సంక్రాంతి పండగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల దగ్గర ప్రత్యేక లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు సందడిగా కనిపిస్తున్నాయి. 

చాలామంది తమ సొంత వాహనాల్లోనే కాకుండా ఆర్టీసీ బస్సులు, ట్రైన్లలోనూ ప్రయాణాలు చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రతి టోల్ ప్లాజా దగ్గర ఆరుగురు తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిని ఉన్నతాధికారులు నియమించారు. మరోవైపు బస్ భవన్, ఎంజీబీఎస్ లోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేశారు.

ఆర్టీసీ బస్సు సౌకర్యాలు

* కరీంనగర్ వెళ్లే వారి కోసం జేబీఎస్ నుంచి బస్సు సౌకర్యం
* నల్గొండ, సూర్యాపేట వెళ్లే వారి కోసం ఎల్బీనగర్ చౌరస్తా దగ్గర నుంచి బస్సు సౌకర్యం 
* వరంగల్ వైపు వెళ్లే వారి కోసం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద బస్సు సౌకర్యం 
* సంగారెడ్డి, నారాయణ ఖేడ్ వైపు వెళ్లే వారి కోసం శేరిలింగంపల్లి దగ్గర బస్సు సౌకర్యం

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. దీంతో పాస్టాగ్ వాహనాల సమయాన్ని మూడు సెకండ్ల నుండి రెండు సెకండ్లకు జీఎంఆర్ తగ్గించింది.