
డిఫరెంట్ మూవీస్‌తో ఆకట్టుకుంటున్న సంతోష్ శోభన్.. త్వరలో ‘ప్రేమ్ కుమార్’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నటుడు, రచయిత అభిషేక్ మహర్షి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మాత. రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్స్. ‘ప్రేమ్ కుమార్ వ్యథ’ పేరుతో మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
హీరో పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణంతో పెళ్లి ఆగిపోతుంది. దీంతో అందరూ అతన్ని ఆటపట్టిస్తుంటారు. విసిగిపోయి జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుని ఓ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్‌తో పరిచయంతో పాటు అతని లైఫ్‌లో కీలక మార్పులు జరుగుతాయి. ఇంతకూ అతనికి పెళ్లయిందా లేదా అన్నదే మెయిన్ కాన్సెప్ట్.
ట్రైలర్‌లో హీరో క్యారెక్టరైజేషన్ ఆసక్తికరంగా ఉండడంతో పాటు కథలో ట్విస్టులు, కామెడీ సీన్స్‌తో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. కృష్ణ తేజ, కృష్ణ చైతన్య, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రల్లో కనిపించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.