స్కాలర్​షిప్​ల కోసం స్టూడెంట్ల ఆందోళన

స్కాలర్​షిప్​ల కోసం స్టూడెంట్ల ఆందోళన

వికారాబాద్, వెలుగు: స్కాలర్​షిప్​ల కోసం వికారాబాద్ లోని అనంత పద్మనాభ స్వామి ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఎస్ఏపీ) ఎయిడెడ్ కాలేజీ స్టూడెంట్లు  తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కారును అడ్డుకున్నారు. స్కాలర్ షిప్​లు రిలీజ్ చేయాలని సోమవారం మధ్యాహ్నం ఆ కాలేజీ స్టూడెంట్లు వికారాబాద్ పట్టణంలో ఆందోళన చేపట్టారు.

అదే టైమ్ లో హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా తాండూరు వెళ్తున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కారును గమనించిన స్టూడెంట్లు వెంటనే అడ్డుకుని రోడ్డుపై  బైఠాయించి ధర్నాకు దిగారు. స్కాలర్ షిప్ లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పట్టణంలోని ఇతర కాలేజీల్లో స్కాలర్​ షిప్​లు వస్తున్నాయని,  ఎస్ ఏపీ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్లకు ఎందుకు రావడం లేదంటూ ఎమ్మెల్యేను నిలదీశారు.

రూ. 11వేల నుంచి 21 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి వెంటనే విద్యాశాఖ మంత్రి సబితతో ఫోన్ లో మాట్లాడారు. సమస్యను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే స్టూడెంట్లకు హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.