సరళా సాగర్ కు కొనసాగుతున్న వరద

సరళా సాగర్ కు  కొనసాగుతున్న వరద

వనపర్తి/మదనాపురం, వెలుగు: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సరళా సాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 0.50టీఎంసీలు కాగా, భారీగా వరద చేరడంతో ఆటోమెటిక్​  సైఫన్  సిస్టంలోని రెండు ప్రైమరీ, రెండు వుడ్  సైఫన్లు తెరచుకుని 14 వేల క్యూసెక్కుల నీరు రామన్ పాడు ప్రాజెక్టులోకి చేరుతోంది. 

వనపర్తి, -కొత్తకోట,-ఆత్మకూరు ప్రధాన రోడ్డులో రైల్వే గేట్  సమీపంలో ఉన్న లో లెవెల్​ కాజ్ వే మీదుగా వరద నీరు ప్రవహించడంతో మూడు రోజులుగా ఆత్మకూరు–-వనపర్తి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఊక చెట్టు వాగులోకి సరళా సాగర్  నీటితో పాటు శంకర సముద్రం నుంచి వరద వచ్చి చేరుతుండడంతో దంతనూరు, శంకరమ్మపేట గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. 

రామన్​పాడు ప్రాజెక్టు రెండు గేట్లను ఓపెన్  చేసి 14 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ఇరిగేషన్ ఏఈ వరప్రసాద్  తెలిపారు. వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా తహసీల్దార్​ జేకే మోహన్, ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు 
అప్రమత్తం చేస్తున్నారు