సరస్వతీ పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు

సరస్వతీ పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి  : మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు
  • పనుల్లో క్వాలిటీ లేకుంటే చర్యలు తప్పవు: మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు

మల్హర్ (మహాదేవపూర్), వెలుగు: కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతీ పుష్క రాలకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని మంత్రి శ్రీధర్‌‌‌‌బాబు అధికారులను ఆదేశించారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వీఐపీ ఘాట్‌‌‌‌, సరస్వతీ మాత విగ్రహం, జ్ఞానతీర్థం, టెంట్‌‌‌‌ సిటీని సందర్శించారు. అనంతరం అన్ని శాఖల ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పుష్కరాల పనుల్లో నాణ్యత పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. 

పుష్కరాల సమయంలో టౌన్ మొత్తాన్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని, సరస్వతీ మాత విగ్రహాన్ని సైతం పూలతో అలంకరించాలని సూచించారు. నది వద్ద 50 మంది గజ ఈతగాళ్లను, నాటు పడవలను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. పుష్కరాల సందర్భంగా మొట్టమొదటిసారిగా కాళేశ్వరంలో టెంట్‌‌‌‌ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

 కార్యక్రమం సజావుగా జరిగేందుకు మినిట్‌‌‌‌ టు మినిట్‌‌‌‌ ప్రోగ్రాం తయారు చేయాలన్నారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్​రెడ్డి హాజరుకానున్నారని, తర్వాత గవర్నర్, మంత్రులు సైతం వచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పట్టణాన్ని క్లీన్‌‌‌‌గా ఉంచాలని, ఒక్క నిమిషం కూడా కరెంట్‌‌‌‌ పోకుండా చర్యలు చేపట్టాలని, అవసరమైతే జనరేటర్లు సిద్ధం 
చేసుకోవాలని సూచించారు. భక్తులకు ప్రతి రోజు అన్నదానం ఏర్పాటుచేయాలని చెప్పారు. 

సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక అధికారులు

సరస్వతీ పుష్కరాల పారిశుధ్య నిర్వహణ, పర్యవేక్షణ కోసం మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్​శాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. నలుగురు డీపీఓలు, నలుగురు డీఎల్పీవోలు, 14 మంది ఎంపీడీవోలు, 28 మంది ఎంపీఓలు మొత్తం 50 మంది అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరంతా జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్​కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ అధికారులంతా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సరస్వతి పుష్కరాల్లో ఎక్కడా ఎలాంటి పారిశుధ్య లోపం తలెత్త కుండా కింది స్థాయి సిబ్బందిని సమన్వయం చేయనున్నారు. పుష్కరాల్లో పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కోటి రూపాయల ఖర్చుతో సరస్వతీ విగ్రహాన్ని  ఏర్పాటు చేస్తున్నారు. 15న సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిసింది.