
- కాళేశ్వరంలో సరస్వతి విగ్రహావిష్కరణ
- 26 తేదీ వరకు కొనసాగనున్న పుష్కరాలు
- రూ.35 కోట్లతో భారీ ఏర్పాట్లు చేసిన సర్కారు
- 8 పార్కింగ్ ప్లేస్‌లు.. బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం
జయశంకర్ భూపాలపల్లి/మల్హర్ (మహాదేవపూర్), వెలుగు: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో నేటినుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. 12 ఏండ్ల తర్వాత జరగనున్న పుష్కరాలకు రాష్ట్ర సర్కారు ఘనంగా ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 5.44 గంటలకు తోగుట ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామీజీ పుష్కర స్నానాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పుష్కరస్నానం ఆచరిస్తారు. కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన ఏకశిల సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. కాశీ పండితులతో ప్రత్యేకంగా నిర్వహించే గోదావరి హారతిలో పాల్గొంటారు. ఆ తర్వాత టెంట్ సిటీని రేవంత్‌రెడ్డి పరిశీలిస్తారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు కుంభమేళాకు వెళ్లలేని భక్తులంతా వస్తారని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో ప్రయాగ్‌రాజ్‌లో చేసినట్టు ఇక్కడకూడా అన్ని ఏర్పాట్లు చేసింది. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు.. రూ.35 కోట్లతో సకల వసతులు కల్పించారు. ఉచిత బస్సు సౌకర్యం వల్ల మహిళా భక్తులు ఎక్కువమంది వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు.
ఆర్టీసీ బస్సుల కోసం సరస్వతి పుష్కరఘాట్‌కు 2 కిలోమీటర్ల దూరంలో తాత్కాలిక బస్ స్టేషన్ నిర్మించారు. ఇక్కడి నుంచి భక్తులు నడిచి వెళ్లే అవసరం లేకుండా 30 ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేసి.. ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేట్ వెహికల్స్ కోసం 8 పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసమే సుమారు 200 ఎకరాలు కేటాయించారు. పార్కింగ్ ప్లేస్‌లలో చలువ పందిళ్లు, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
గోదావరి ఒడ్డు వెంబడి డబుల్ రోడ్డు
కాళేశ్వరం టెంపుల్ నుంచి గోదావరి మెయిన్ ఘాట్ వరకు ఇదివరకే రోడ్డు సౌకర్యం ఉంది. త్రివేణి సంగమం దగ్గరలో ఉన్న ఘాట్ వెడల్పు చేయడంతోపాటు అధునాతన సౌకర్యాలతో నూతన ఘాట్ నిర్మించారు. దానికి సరస్వతి ఘాట్ అని పేరు పెట్టారు. ఈ ఘాట్‌కు వెళ్లేందుకు మెయిన్ ఘాట్ నుంచి, కాళేశ్వరం ప్రధాన రహదారి నుంచి రెండు రూట్లలో కొత్తగా డబుల్ రోడ్డు వేశారు. ఈ రోడ్డు కోసం భూములు సేకరించి రైతులకు నష్ట పరిహారం చెల్లించారు. రోడ్డు వెంబడి పోల్స్ వేసి, లైట్లు అమర్చారు. పుష్కరాల సందర్భంగా 24 గంటలపాటు కరెంట్ సప్లై ఉండేలా రూ.2 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించారు. కాళేశ్వరం గ్రామంలో అదనంగా 10 ట్రాన్స్‌ఫార్మర్లు బిగించారు.
పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: శైలజా రామయ్యర్
సరస్వతీ పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. బుధవారం ఆమె కాళేశ్వరంలో సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి సరస్వతీ దేవీ విగ్రహం, ఘాట్ ను ప్రారంభిస్తారని, పుష్కర స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటారని చెప్పారు. ఆ తర్వాత త్రివేణి సంగమంలో మొట్ట మొదటిసారిగా కాశీ పండితులు నిర్వహించనున్న నదీ హారతిలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు సకల సౌకర్యాలు..
- సరస్వతి పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహం పైన, పక్కన సినిమా స్టైల్‌లో దేవాలయం సెట్ వేశారు. దాదాపు ఎకరం భూమిలో ఈ సెట్‌ను రూపొందించారు. భక్తులను ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దారు.
- భక్తుల వసతి కోసం దేవస్థానం వద్ద 100 రూముల వసతి గృహం, డార్మేటరీ అందుబాటులోకి తీసుకొచ్చారు. సరస్వతి ఘాట్ వద్ద 100 గదులతో టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏసీ, కూలర్ల సౌకర్యం కల్పించారు. భక్తులకు వీటిని రెంట్ పద్ధతిలో ఇస్తారు.
- భక్తుల స్నానాల కోసం షవర్లు, బట్టలు మార్చుకొనే గదులు ఏర్పాటు చేశారు, దేవాలయం చుట్టూ, పుష్కర ఘాట్ల వద్ద చలువ పందిళ్లు వేశారు. కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి, తాగునీటి సౌకర్యం కల్పించారు. దేవాలయం చుట్టూ సీసీ రోడ్ల నిర్మాణం, పిండ ప్రదాన మండపం, శాశ్వత మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మించారు.
- శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద లడ్డు, పులిహోర ప్రసాదాలు అందుబాటులో ఉంచారు. భక్తులకు ఉచిత అన్నదానం, ఉచిత ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరిగే 12 రోజులు కాశీ నుంచి వచ్చే పురోహితులు ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. దేవాలయం వద్ద 12 రోజులపాటు హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. దేవస్థానం, పుష్కర ఘాట్ లు, బస్టాండ్, పార్కింగ్ స్థలాల వద్ద ఎల్లప్పుడూ డాక్టర్లు , వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు.
సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆఫీసర్లకు 12 రోజులపాటు విధులు కేటాయించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మాదిరిగానే రోజుకు 3 షిఫ్టుల్లో వారు పని చేస్తారు. గోదావరి నదిలో భక్తులకు ప్రమాదం జరగకుండా 50 మంది గజ ఈతగాళ్లు నాటు పడవలతో పహారా కాసేలా ఏర్పాట్లు చేశారు.