30 గ్రాముల బంగారం.. 500 గ్రాముల వెండితో చీర

30 గ్రాముల బంగారం.. 500 గ్రాముల వెండితో చీర

రాజన్న సిరిసిల్ల, వెలుగు : అగ్గిపెట్టెలో పట్టే చీరను, పట్టుతో వివిధ రకాల బొమ్మలు వేసి  నేసిన చీరను చూశాం. ఇలాంటి ప్రయోగాలకు వేదికైన సిరిసిల్ల నుంచి ప్రముఖ చేనేత కళాకారుడు నల్ల విజయ్​రంగులు మారే చీరను తయారు చేసి ఔరా అనిపించాడు. రంగులు మారే వివిధ పట్టు పురుగుల నుంచి సేకరించిన పట్టు, 30 గ్రాముల బంగారం..500 గ్రాముల వెండితో నెల రోజులు పాటు శ్రమించి ఈ చీరను తయారు చేశాడు. 

దీనికి రూ.2 లక్షల 80 వేలు ఖర్చయ్యిందని విజయ్​చెప్పాడు. చీర పొడుగు 6.3 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు ఉండడంతో పాటు ఆరు వందల గ్రాములు బరువు ఉంటుందన్నాడు. తెలిసిన వ్యాపారవేత్త ఆర్డర్​ఇవ్వడంతో తయారు చేసినట్టు తెలిపాడు. ఈ చీరను సోమవారం హైదరాబాద్​లోని సచివాలయంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. నల్ల విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసిన నల్ల పరంధాములు కుమారుడు. విజయ్ ఇటీవల సుగంధాలు వెదజల్లే చీరను తయారు చేశారు. ఈ సందర్భంగా విజయ్ పని తీరును కేటీఆర్ ​అభినందించారు.