కొత్త పింఛన్ల మంజూరులో సర్కార్ మెలిక

కొత్త పింఛన్ల మంజూరులో సర్కార్ మెలిక
  • చేనేత, గీత కార్మికులు చనిపోతే.. వారి భార్యలకు పింఛన్​ ఇచ్చేందుకు నో చాన్స్
  • ఓల్డేజ్ పింఛన్లు తీసుకుంటున్నోళ్లు చనిపోతేనే వారి భార్యలకు పింఛన్

హైదరాబాద్, వెలుగు: కొత్త పెన్షన్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతోంది. అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ ఎప్పటికప్పుడు కొత్త పింఛన్లను మంజూరు చేయకుండా కొందరికే ఇచ్చేలా నిబంధనలను సవరించింది. కేవలం ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటున్నవాళ్లు చనిపోతేనే ఆ పెన్షన్ ను వారి జీవిత భాగస్వాముల పేరిట 15 రోజుల్లో ట్రాన్స్ ఫర్ చేయాలని నిర్ణయించింది. అయితే, పింఛన్ తీసుకుంటున్న గీత, చేనేత కార్మికులు చనిపోతే వారి జీవిత భాగస్వాములకు కూడా వితంతు లేదా వృద్ధాప్య పింఛన్ ను ట్రాన్స్ ఫర్ చేసే విషయాన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎలాంటి పెన్షన్ పొందని 57 ఏళ్లలోపు మగవాళ్లు చనిపోతే.. కొత్త రూల్ ప్రకారం వారి భార్యలకు వితంతు పెన్షన్15 రోజుల్లో మంజూరయ్యే అవకాశం లేదు. కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం అప్లికేషన్ల స్వీకరణ మొదలుపెట్టినప్పుడే ఇలాంటి వారు అప్లై చేసుకోవడానికి వీలు కానుంది. 

ఆన్ లైన్​లో ఆప్షన్ ఇయ్యలే..  

కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన చేనేత కార్మికుడు లచ్చయ్య(64) నిరుడు నవంబర్ లో గుండెపోటుతో చనిపోయాడు. ఆయన ప్రభుత్వం నుంచి చేనేత వృద్ధాప్య పింఛన్ పొందుతున్నారు. లచ్చయ్య  చనిపోయాక ఆయన భార్య భూలక్ష్మి(61)కి వితంతు పింఛన్ లేదా వృద్ధాప్య పింఛన్ మంజూరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇటీవల అధికారులకు దరఖాస్తు కూడా పెట్టుకుంది. అధికారులు ఆన్ లైన్ లో చూసి.. ఓల్డేజ్ పెన్షన్ దారు చనిపోతేనే భార్యకు పెన్షన్ మంజూరు చేసే ఆప్షన్ ఉందని, పింఛన్ తీసుకునే చేనేత, గీత కార్మికులు చనిపోతే వారి భార్యలకు పింఛన్ మంజూరు చేసే చాన్స్ లేదని చెప్పారు. మళ్లీ ప్రభుత్వం కొత్తగా అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పినప్పుడే అప్లై చేసుకోవాలని సూచించారు. దీంతో భూలక్ష్మి నిరాశతో వెనుదిరిగింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది చేనేత, గీత కార్మికుల భార్యలు పింఛన్ రాక ఇబ్బందులు పడుతున్నారు.   

లక్షన్నర మంది ఎదురు చూపులు..

ఆసరా పెన్షన్ల మంజూరు కోసం 2021 అక్టోబర్ లో అప్లికేషన్లు తీసుకున్న ప్రభుత్వం.. ఆ తర్వాత 14 నెలల కాలంలో కొత్తగా అర్హత పొందినవారిని పట్టించుకోలేదు. 2021 నవంబర్ తర్వాత రాష్ట్రంలో భర్తను కోల్పోయిన మహిళలు, కొత్తగా సదరం సర్టిఫికెట్ పొందిన దివ్యాంగులు, 57 ఏళ్లు నిండిన వ్యక్తులు, ఒంటరి మహిళలు, 50 ఏళ్లు నిండిన బీడీ, గీత కార్మికులు కలిపి లక్షన్నర మంది వరకు ఉంటారని అంచనా. అయితే, ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటూ ఎవరైనా వృద్ధుడు చనిపోతే ఆయన పెన్షన్ ను అతడి భార్యకు ఇప్పుడు ట్రాన్స్ ఫర్ చేయనున్నారు. ఇలాంటి వాళ్ల సంఖ్య 15 నెలల కాలంలో 60 వేలకు చేరి ఉంటుందని చెప్తున్నారు. రాష్ట్రంలో 36,872 మంది చేనేత కార్మికులు, 62,164 మంది గీత కార్మికులు ఈ కేటగిరీలో పెన్షన్ పొందుతుండగా.. వీరిలోనూ నెలకు పదుల సంఖ్యలో వివిధ కారణాలతో చనిపోతున్నారు. వీరి భార్యలకు కూడా వెంటనే పింఛన్ శాంక్షన్ కావడం లేదు. కొత్తగా పెన్షన్ పొందినవాళ్లకు మళ్లీ ఎన్నికలు వస్తే తప్ప పింఛన్ మంజూరయ్యే పరిస్థితి కనిపించడం లేదు.