మేడారంలో ఇలా నిర్మించి.. అలా తొలగించిన్రు

మేడారంలో ఇలా నిర్మించి.. అలా తొలగించిన్రు
  • మేడారంలో అధికారుల ఆగమాగం పనులు
  • మాస్టర్‌‌ప్లాన్‌‌ అమలుకు నెల రోజుల ముందే రూ. 3.80 కోట్లతో షెడ్‌‌ నిర్మాణం
  • గద్దెల విస్తరణ పేరుతో తొలగింపు
  • ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు

ములుగు/తాడ్వాయి, వెలుగు : మేడారంలో చేపట్టిన అభివృద్ధి పనుల విషయంలో ఆఫీసర్ల సమన్వయలోపం, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మాస్టర్‌‌ ప్లాన్‌‌ అమలు చేయాలని తెలిసినా.. అందుకు నెల రోజుల ముందే కోట్ల రూపాయలు వెచ్చించి షెడ్లు నిర్మించారు. వాటిని అభివృద్ధి పేరుతో ఇప్పుడు తొలగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 మేడారం మహాజాతరకు తరలివచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనలో భాగంగా క్యూలైన్లలో నీడ, తాగు నీటి సౌకర్యం కల్పించాలని ఆఫీసర్లు గతంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో ప్రభుత్వం రూ. 3.80 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో క్యూలైన్లపైన భారీ షెడ్లను నిర్మించారు. క్యూలైన్ల మధ్యలో తాగునీటి సౌకర్యంతో పాటు వృద్ధులు, బాలింతలు, చిన్నారులు కూర్చునేందుకు సైతం తగిన ఏర్పాట్లు చేశారు. 

గద్దెల విస్తరణలో భాగంగా కూల్చివేత

మేడారం మాస్టర్‌‌ప్లాన్‌‌ అమలుపై ఓ వైపు ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరుగుతుండగానే.. మరో వైపు హడావుడిగా క్యూలైన్లపై షెడ్లను నిర్మించారు. అయితే మేడారంలో గద్దెల పునర్నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టడంతో గతంలో నిర్మించిన షెడ్లను ప్రస్తుతం తొలగిస్తున్నారు. 

మాస్టర్‌‌ ప్లాన్‌‌ అమలు చేస్తారని ముందే తెలిసినా ఆగమేఘాల మీద షెడ్లను నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆఫీసర్లు ముందస్తు ఆలోచన లేకుండా చేసిన పనుల కారణంగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయిందని మండిపడుతున్నారు.