దేశాన్ని సర్కారీ తాలిబాన్లు కబ్జా చేసిన్రు

దేశాన్ని సర్కారీ తాలిబాన్లు కబ్జా చేసిన్రు

దేశాన్ని సర్కారీ తాలిబాన్లు కబ్జా చేశారన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్. దేశంలో సర్కారీ తాలిబాన్ కమాండర్లు ఉన్నారని ఆయన అన్నారు. రైతుల తలలు పగులగొట్టమని పోలీసులకు ఆదేశాలిచ్చిన అధికారులే.. తాలిబాన్ కమాండర్లని ఆరోపించారు. అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా హర్యానాలోని కర్నాల్‌లో శనివారం రైతులు నిరసనలు చేస్తుండగా పోలీసులు లాఠీ చార్జ్ చేయడంపై రాకేశ్ తికాయత్ ఇలా స్పందించారు. నిరసనకారుల తలలు పగలగొట్టండి అంటూ సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ ఆయుష్ సిన్హా పోలీసులకు ఆదేశాలు ఇస్తున్న వీడియో నిన్న వైరల్ కావడంతో దానిని ఆయన గుర్తు చేస్తూ తాలిబాన్‌ కమాండర్‌‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న (శనివారం) హర్యానాలోని కర్నాల్‌లో ఒక సభలో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌ ఖట్టర్ వెళ్తున్న నేపథ్యంలో అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలిపేందుకు అక్కడికి సమీపంలో ఉన్న బస్తారా టోల్‌ప్లాజా వద్ద రైతులు గుమ్మిగూడారు. దీంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించిన పోలీసులు.. వారిపై లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటనలో పది మందికి పైగా రైతులకు గాయాలయ్యాయి. దీనిపై సీరియస్‌గా స్పందించిన రాకేశ్ తికాయత్.. హర్యానా సీఎం ఖట్టర్‌‌ను స్వాతంత్ర్య సంగ్రామంలో జలియన్‌వాలా బాగ్‌ దురాగతానికి కారణమైన బ్రిటిష్‌ జనరల్ డయ్యర్‌‌తో పోల్చారు. సీఎం ఖట్టర్ తీరు జనరల్‌ డయ్యర్‌‌లా ఉందని, రైతులపై పోలీసులు పాల్పడిన దురాగతాలకు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన నిన్న ట్వీట్ చేశారు.