పాపన్నపేట మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచులు డుమ్మా

పాపన్నపేట మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచులు డుమ్మా

మెదక్ (కౌడిపల్లి)/పాపన్నపేట, వెలుగు: ‘మన ఊరు– -మన బడి’ పథకం కింద చేసిన పనులకు బిల్లులు రాక అప్పులు తెచ్చి సతమతమవుతున్నామని, బిల్లులు వస్తేనే పెండింగ్​పనులు పూర్తి చేస్తామని సర్పంచ్​లు స్పష్టం చేశారు. కౌడిపల్లి జడ్పీ హైస్కూల్​లో శుక్రవారం డీఈవో  రమేశ్, ఆఫీసర్లు ఆయా  గ్రామాల సర్పంచ్​ లతో ‘మన ఊరు– - మన బడి’  పనులపై  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్​లు మాట్లాడుతూ ఈ  స్కీం కింద స్కూళ్లలో పనులు చేయగా బిల్లులు చాలా వరకు రాలేదని తెలిపారు. ఎలక్ట్రిక్​వర్క్స్​కు సంబంధించిన బిల్లులు రాలేదని డీఈవో కు వివరించారు. బిల్లులు రాక  ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. డీఈవో స్పందిస్తూ బిల్లులు వచ్చేలా పై ఆఫీసర్లతో మాట్లాడుతానని, స్కూళ్లలో సౌలత్​లు  మెరుగు పరచేందుకు  ‘మన బడి ’ మంచి పథకమని, ఆఫీసర్లు, హెడ్​మాస్టర్లు, ఎస్ఎంసీ చైర్మన్లు సమన్వయంతో కలిసి పనిచేస్తే స్కూళ్లు బాగుపడతాయన్నారు. డిసెంబర్ చివరి వరకు పనులు పూర్తి చేయాలని  ఆదేశించారు. ఎంపీడీవో భా రతి, ఏఈ ప్రభాకర్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. 

బిల్లులిస్తలేరని మండల సభకు సర్పంచులు డుమ్మా

చేసిన పనులకు బిల్లులు వస్తలేవని పాపన్నపేట మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచులు మూకుమ్మడిగా డుమ్మా కొట్టారు. శుక్రవారం పాపన్నపేట ఎంపీపీ చందనారెడ్డి అధ్యక్షతన ‘వెలుగు’ ఆఫీస్​లో సర్వసభ్య సమావేశం జరిగింది.  ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశానికి ఆఫీసర్లు, ఎంపీటీసీలందరూ హాజరైనప్పటికీ 36 మంది సర్పంచ్​లకు ఇద్దరు మాత్రమే వచ్చారు. దీంతో సభ స్టార్ట్ చేయకుండా ఆఫీసర్లు సర్పంచ్​ల కోసం గంటసేపు ఎదురు చూశారు. అయినా రాకపోవడంతో ఎంపీడీవో శ్రీనివాస్ సర్పంచ్​లకు ఫోన్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత  పాపన్నపేట సర్పంచ్ గురుమూర్తి గౌడ్ రాగానే ఎంపీపీ సమావేశాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సభ జరుగుతుండగా మరో ఏడుగురు సర్పంచ్​లు వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్​లు మాట్లాడుతూ చేసిన పనులకు బిల్లులు రాక అప్పుల పాలవుతున్నామని వాపోయారు.  బిల్లులు వచ్చేవరకు కొత్త పనులు చేయమని తేల్చి చెప్పారు.  ఆరోగ్యశ్రీ కార్డులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పాపన్నపేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ సభ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీపీ చందనారెడ్డి మాట్లాడుతూ రైతులు సమస్యల పరిష్కారం కోసం వస్తే తహసీల్దార్​ దురుసుగా  మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయకుంటే లీవ్ పెట్టుకోండి అంటూ సీరియస్​అయ్యారు.  ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహసీల్దార్​కు సూచించారు. కల్యాణ లక్ష్మి లబ్ధిదారులను అకారణంగా ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆఫీసర్లపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మల్లంపేట, ముద్దపురం సర్పంచ్​లు బాపురెడ్డి, దానయ్య బిల్లులు రాక తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం ప్రెసిడెంట్​కుబేర్, కో ఆప్షన్ మెంబర్ గౌస్ ,  తహసీల్దార్​ మహేందర్ కుమార్ పాల్గొన్నారు.