- నిర్మల్ జిల్లా జవుల (కె) గ్రామంలో సంఘటన
- ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్న ఆలోచన
- నిర్మల్‌జిల్లా జవుల (కె) గ్రామంలో సంఘటన
భైంసా, వెలుగు: సర్పంచ్‌గా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థికి సొంతూర్లో ఇల్లు లేదని గ్రామస్తులు విమర్శలు చేయడంతో.. వినూత్నంగా ఆలోచించిన ఆ అభ్యర్థి ఊర్లో కంటైనర్ ఇల్లు సెటప్ చేసుకున్నాడు. ఇప్పుడు అందులోనే నివాసముంటూ ఊర్లో ప్రచారం నిర్వహిస్తున్నాడు. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని జవుల (కె) గ్రామానికి చెందిన బొయిన్‌వాడ్ వినోద్ వ్యాపార నిమిత్తం పదేండ్ల కింద మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు వెళ్లి, అక్కడే స్థిరపడ్డాడు. ఊర్లో వ్యవసాయ భూమి ఉండడంతో నెలకోసారి వచ్చి పొలం పనులు చూసుకుంటున్నాడు.
ఊళ్లో భూమి ఉన్నప్పటికీ, సొంతిల్లు మాత్రం లేదు. అయితే సర్పంచ్‌గా పోటీ చేయాలని అనుకున్న వినోద్.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆయన గ్రామంలో ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో వినోద్ ప్రచారం ముమ్మరం చేశాడు.
అయితే, వినోద్‌కు ఊర్లో ఇల్లు లేదని ప్రత్యర్థులు, గ్రామస్తులు విమర్శలు చేశారు. దీంతో ఇప్పటికిప్పుడు సొంతిల్లు కట్టుకుంటే చాలా టైమ్ పడుతుందని ఆలోచించిన వినోద్.. రూ.6 లక్షలు వెచ్చించి హైదరాబాద్ నుంచి కంటైనర్ ఇల్లు తెప్పించాడు. గ్రామంలోని తన ప్లాట్‌లో దాన్ని సెటప్ చేసుకున్నాడు. ఇప్పుడు అందులోనే ఉంటూ ఊర్లో ప్రచారం నిర్వహిస్తున్నాడు.
