మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించాల్సిన శిలాఫలకాన్ని పీకేసిన ఉప్పల ​సర్పంచ్ ​వర్గం

మంత్రి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించాల్సిన  శిలాఫలకాన్ని పీకేసిన ఉప్పల ​సర్పంచ్ ​వర్గం

అయిజ, వెలుగు: గ్రామ సర్పంచ్, ఎంపీటీసీకి తెలియకుండా సబ్ స్టేషన్ ను ఎలా ఓపెన్ చేస్తారంటూ అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి ఆవిష్కరించాల్సిన శిలాఫలకాన్ని సర్పంచ్​వర్గీయులు పీకేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉప్పల గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ ను మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం శుక్రవారం ప్రారంభించాల్సి ఉంది. భార్యాభర్తలైన ఎంపీటీసీ ప్రహ్లాదరెడ్డి, సర్పంచ్​జయంతికి తెలియకుండా శిలాఫలకంపై పేర్లు వేయించడంపై ఎంపీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంత్రి, ఎమ్మెల్యే రాక ముందు కరెంట్ ఆఫీసర్లతో గొడవకు దిగారు. తమని సంప్రదించకుండా శిలాఫలకంపై పేర్లు ఎలా పెడతారని నిలదీశారు. తమ పేర్లు తొలగించాలని వాగ్వాదానికి దిగారు. పోలీసులు సర్దిచెప్పినా ప్రహ్లాద్​వినిపించుకోలేదు. ఈ క్రమంలో అతని వర్గీయులు శిలాఫలకాన్ని పీకేశారు. అడ్డుకుంటే కరెంట్​వైర్లు పట్టుకొని చచ్చిపోతానంటూ ఎంపీటీసీ బెదిరించడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. మళ్లీ శిలాఫలకాన్ని తెచ్చి అమర్చగా మంత్రి నిరంజన్​ ఆవిష్కరించారు.