సర్పంచ్ పదవికి వేలం..పోచమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన ఫండ్స్‌‌ కోసం అర్రాస్

సర్పంచ్ పదవికి వేలం..పోచమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన ఫండ్స్‌‌ కోసం అర్రాస్
  • పోచమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన ఫండ్స్‌‌ కోసం అర్రాస్
  • రూ.9.35 లక్షలకు దక్కించుకున్న ఓ కుల సంఘం పెద్ద
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంకుషాపురంలో ఘటన

మొగుళ్లపల్లి, వెలుగు:  గ్రామంలో కొత్తగా కట్టిన పోచమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన ఖర్చుల కోసం ఏకంగా సర్పంచ్ పదవిని అర్రాస్ పెట్టారు. రూ.10 లక్షలు ఖర్చు అవుతాయని లెక్క కట్టి.. వేలం పాట పాడారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం అంకుషాపురంలో జరిగిందీ ఘటన. అంకుషాపురంలో అందరూ చందాలు వేసుకొని పోచమ్మ టెంపుల్ కట్టించారు. గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆయా కుల సంఘాల పెద్దలు నవంబర్ 22ను ముహూర్తంగా ఫిక్స్ చేశారు. ఇందుకోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చవుతుందని భావించారు. కానీ చందాల ద్వారా వచ్చిన మొత్తం గుడి నిర్మాణానికే సరిపోవడంతో ప్రతిష్ఠాపన ఖర్చుల కోసం ఏం చేయాలా? అని ఆలోచించారు. చివరికి మూడు నెలల్లో ఖాళీ కానున్న సర్పంచ్ పదవిని వేలం వేయాలని నిర్ణయించారు. 

సోమవారం గ్రామంలోని పెద్ద మనుషులంతా స్థానిక హనుమాన్ టెంపుల్ సమీపంలో కూర్చుని వేలం పాట మొదలుపెట్టారు. రూ.3 లక్షలతో మొదలైన వేలంపాట రూ.9 లక్షల 35 వేల దగ్గర ముగిసింది. పాటలో ఆరుగురు పాల్గొనగా.. ఓ కుల సంఘం పెద్ద దక్కించుకున్నాడు. విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రటరీ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విషయాన్ని మండల నోడల్ ఆఫీసర్ (ఎంపీడీవో) కృష్ణవేణికి సమాచారం అందించారు. ఆమె స్థానిక ఎస్ఐ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్ఐ సిబ్బందిని పంపించగా.. అప్పటికే అందరూ ఎవరి ఇండ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఎంపీడీవోను వివరణ కోరగా.. ఎలక్షన్ కోడ్‌‌‌‌ను ఉల్లంఘించి గ్రామస్తులు వేలంపాట నిర్వహించిన మాట వాస్తవమేనని, దీనిపై ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.