దళితబంధు కోసం సర్పంచ్ లంచం తీసుకుండు

దళితబంధు కోసం సర్పంచ్ లంచం తీసుకుండు
  •     మీడియాతో మొరిపిరాల దళితబంధు లబ్దిదారులు

యాదగిరిగుట్ట, వెలుగు : దళితబంధు రావడం కోసం మొరిపిరాల సర్పంచ్ సామ తిరుమల్ రెడ్డి  తమ నుంచి లంచం తీసుకున్నాడని దళితబంధు లబ్దిదారులు తెలిపారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. దళితబంధు కోసం సర్పంచ్ రూ.1.50 లక్షలు లంచం తీసుకున్నాడని లబ్ధిదారుడు ముప్పిడి అంజయ్య తెలిపారు. అలాగే  మేడ పద్మ నుంచి రూ.1.50 లక్షలు, ముప్పిడి మారెమ్మ దగ్గర రూ.1 లక్ష, ఇంద్రవెల్లి వరలక్ష్మీ నుంచి రూ.70 వేలు, ముప్పిడి హేమలత దగ్గర రూ.30 వేల చొప్పున సర్పంచ్ లంచం తీసుకున్నాడని వెల్లడించారు. మొరిపిరాల జీపీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న ముప్పిడి స్వామి ద్వారా సర్పంచ్ కు డబ్బులు ఇచ్చామని వారు పేర్కొన్నారు. కాగా దళితబంధు కింద తనకు సర్పంచ్ ఒకసారి రూ.1 లక్ష క్యాష్, మరోసారి రూ.3 లక్షల చెక్కు ఇచ్చాడని ముప్పిడి అంజయ్య తెలిపారు. అట్టి చెక్కును మీడియాకు చూపించారు. 

ఇందుకోసం సర్పంచ్ రూ.1.50 లక్షల లంచం అడిగితే ఒకసారి రూ.70 వేలు, మరోసారి రూ.80 వేలు కలిపి మొత్తం రూ.1.50 లక్షలు స్వామి అనే వ్యక్తి ద్వారా  పంపించానని చెప్పారు. ఇప్పుడేమో దళితబంధు లబ్ధిదారుల నుంచి ఎలాంటి లంచం తీసుకోలేదని సర్పంచ్ బుకాయిస్తున్నాడని తెలిపారు. సర్పంచ్ కు ఎలాంటి లంచం ఇవ్వలేదని మీడియాతో చెప్పాలని అనుచరుల ద్వారా బెదిరిస్తున్నాడని చెప్పారు. కాగా ఇదే విషయం గురించి సర్పంచ్ తిరుమల్ రెడ్డిని ఫోన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.  కార్యక్రమంలో  లబ్దిదారులు ముప్పిడి అంజయ్య, ముప్పిడి మారెమ్మ, ఇంద్రవల్లి వరలక్ష్మీ, మేడ పద్మ, ముప్పిడి హేమలత పాల్గొన్నారు.