
- ప్రభుత్వ తీరు మోసపూరితమని ఫైర్
- అధికారులు డిజిటల్ కీ దుర్వినియోగం చేశారు
- సైబర్ క్రైం కింద కేసులు పెడ్తమని వెల్లడి
- బీఆర్ఎస్కు రాజీనామాపై వెనక్కి తగ్గని వాంకిడి సర్పంచులు
హైదరాబాద్/ వేలేరు/ గూడూరు/ కరీంనగర్ టౌన్/ఆసిఫాబాద్, వెలుగు: కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల దారి మళ్లింపుపై సర్పంచుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ప్రతి నెల నిధులు ఇస్తున్నామని ప్రచారం చేసుకోవడమే తప్ప పైసా ఇవ్వడం లేదని సర్పంచులు మండిపడుతున్నారు. నిధుల దారి మళ్లింపుపై ప్రతి రోజు అనేక ప్రాంతాల్లో నిరసనలకు దిగుతూనే ఉన్నారు. హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని గోళ్లకిష్టంపల్లి, లోక్యతండా, చింతల్ తండా, బండతండా, కమ్మరిపేట గ్రామాల సర్పంచులు ఆయా గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను మూడు రోజుల క్రితం ఎంపీడీవో ఆఫీసుకు తరలించారు. వాటి ఈఎంఐలు, డీజిల్ ఖర్చులు భరించలేకపోతున్నామని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల నుంచి ఫండ్స్ఇవ్వకపోవడంతో ట్రాక్టర్ల ఈఎంఐలు కట్టలేకపోతున్నామని, బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడి పెరిగిపోతోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఫండ్స్ ఇస్తే తప్ప ట్రాక్టర్లు తీసుకెళ్లేది లేదని వాళ్లు తేల్చిచెప్పారు.
పెండింగ్బిల్లులన్నీ చెల్లించాలి
ఆర్థిక సంఘం నిధులను వాపస్ చేయకుంటే మంత్రులు, ఎంపీల ఇండ్లు ముట్టడిస్తామని సర్పంచుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అంజనీ ప్రసాద్ హెచ్చరించారు. గురువారం కరీంనగర్ ప్రెస్ క్లబ్‌లో సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు బోయిని కొమురయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. క్రిస్మస్ సెలవు రోజు రూల్స్‌కు విరుద్ధంగా ఎంపీడీవోలు,ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పంచాయతీల ఖాతాల్లోని నిధులు దారి మళ్లించారని తెలిపారు. సర్పంచుల డిజిటల్ కీలను దుర్వినియోగం చేసిన పంచాయతీ అధికారులపై 420, సెబర్ క్రైం సెక్షన్‌ల కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపోరాటం చేస్తామన్నారు. వెంటనే సర్పంచులకు డిజిటల్ కీలు హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఆరు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని, 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు దారి మళ్లించడం సరికాదన్నారు. తమ మెడపై కత్తి పెట్టి నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు సహా ఎన్నో పనులు చేయించారని, తమతో ఎట్లా ఈ పనులు చేయించారో అట్లాగే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు బిల్లులు ఇవ్వాల్సి ఉందన్నారు. పంచాయతీలకు రూ.100 కోట్ల సీనరేజీ ఫండ్స్ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలన్నారు.
పంచాయతీల ఎకౌంట్లలో జమ చేయకుంటే పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని సర్పంచులు హెచ్చరించారు. గురువారం ఎంపీడీవో ఆఫీస్ ఎదుట ఆందోళన తర్వాత తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సూపరింటెండెంట్ కరణ్ సింగ్‌కు అందజేశారు. దారిమళ్లించిన నిధులు తిరిగి పంచాయతీల ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి జనవరి మూడో తేదీ వరకు గడువిస్తున్నామని, ప్రభుత్వం స్పందించకుంటే రాజీనామా చేస్తామని తేల్చిచెప్పారు. నిధులు ఇచ్చే వరకు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోమన్నారు. ఆందోళనలో సర్పంచులు వెంకన్న, తులసీరాం నాయక్, రమేశ్, కవిత అశోక్, భవాని విష్ణు, సునీత, శైలజ తదితరులు పాల్గొన్నారు.
హరీశ్ ను కలిసేందుకు ఒప్పకోని సర్పంచులు
తమ అనుమతిలేకుండా కేంద్ర నిధులు దారిమళ్లించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్కు రాజీనామా చేసిన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల సర్పంచులు వెనక్కి తగ్గడం లేదు. మంత్రి హరీశ్‌ను కల్పిస్తానని కాగజ్నగర్ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పంపిన ఆహ్వానాన్ని వారు తిరస్కరించారు. వాంకిడి సర్పంచులను బుజ్జగించేందుకు లోకల్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్పర్సన్కోవలక్ష్మి రెండుమూడ్రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గురువారం కాగజ్ నగర్ పర్యటనకు వెళ్లిన హరీశ్‌తో మాట్లాడిస్తామని ఎమ్మెల్యే కోనప్ప పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించినట్లు ఆదివాసీ సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు కోట్నాక్ కిష్టు, ప్రధాన కార్యదర్శి సిడాం పేర్కొన్నారు. రాజీనామాలు వెనక్కి తీసుకొనే ప్రసక్తే లేదని తెలిపారు.
డిజిటల్ కీలు సర్పంచులకు ఇచ్చేయండి
కేంద్రం ఇచ్చిన నిధుల మళ్లింపుపై ఉద్యమ బాట పట్టిన సర్పంచులు, ఉప సర్పంచుల డిజిటల్ కీలు తిరిగి ఇచ్చేయాలని మండల పంచాయతీ అధికారులకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎంపీవోలు సంబంధిత పంచాయతీ సెక్రటరీలతో సర్పంచులకు డిజిటల్ కీలను బుధ, గురువారాల్లో తిరిగి పంపారు. అయితే ఈ డిజిటల్ కీలు తిరిగి తీసుకునేందుకు కొందరు సర్పంచులు అధికారులకు షరతులు పెట్టినట్టు తెలిసింది. తమకు డిజిటల్ కీ హ్యాండోవర్ చేసే సమయం వరకు జరిగిన ట్రాంజాక్షన్స్‌తో సర్పంచులకు ఎలాంటి సంబంధం లేదని రాత పూర్వకంగా ఇవ్వాలని ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులను కోరినట్టు తెలిసింది. కొందరు అధికారులు సర్పంచులకు సర్దిచెప్పి డిజిటల్ కీలను తిరిగి ఇచ్చేయగా, మరికొన్ని చోట్ల ఉన్నతాధికారుల అభిప్రాయం తీసుకొని రాతపూర్వకంగా ట్రాంజాక్షన్స్‌పై వివరణ ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల దారి మళ్లింపును అడ్డంగా సమర్థించుకునే ప్రయత్నం చేసిన ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ సర్పంచుల ఆందోళనలు, మీడియాలో కథనాలతో దిగివచ్చింది.