సప్పుడు బంద్..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం

సప్పుడు బంద్..ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం
  • రేపు పోలింగ్.. రాత్రి వరకు ఫలితాలు​
  • చివరి రోజు జోరుగా సాగిన ప్రచారం

మహబూబ్ ​నగర్​, వెలుగు :  సర్పంచ్​, వార్డు మెంబర్ల ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి, రెండో విడత ఎన్నికలు పూర్తి కాగా, మూడో విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. దీంతో సోమవారం నుంచి మూడో విడత ఎన్నికల ప్రచారం బంద్ అయ్యింది. అయితే పోలింగ్​ఒక్క రోజే టైం ఉండడంతో క్యాండిడేట్లు ఓటర్లను ప్రలోబాలకు గురిచేసేందుకు తెర లేపారు.

మూడో విడత ఇలా..

మూడో విడత ఎన్నికల్లో భాగంగా మహబూబ్​నగర్ జిల్లాలోని అడ్డాకుల, బాలానగర్, జడ్చర్ల, మూసాపేట, భూత్పూర్​మండలాల్లోని 133 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. పది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 122 సర్పంచ్​ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, సర్పంచ్​ స్థానాల కోసం 440 మంది పోటీ పడుతున్నారు. 

ఈ ఐదు మండలాల్లోని 1152 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించగా, 231 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. జడ్చర్ల మండలంలోని ఏడు వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ ​కూడా దాఖలు కాలేదు. దీంతో 914 వార్డు స్థానాలకు పోలింగ్​నిర్వహించనుండగా, 2,584 మంది బరిలో నిలిచారు. 

నారాయణపేట జిల్లాలోని మక్తల్, కృష్ణ, మాగనూరు, నర్వ, ఊట్కూరు మండలాల్లోని 110 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో పది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో వంద గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాలను దక్కించుకునేందుకు 327 మంది పోటీ పడుతున్నారు. ఈ ఐదు మండలాల్లో 994 వార్డులుండగా, 219 వార్డుల ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 775 వార్డులకు ఎన్నికలు జరగనుండగా,1,992 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
    
జోగులాంబ గద్వాల జిల్లాలో ఎర్రవల్లి, ఇటిక్యాల, మానవపాడు, ఉండవల్లి, ఆలంపూర్ మండలాల్లోని 75 గ్రామ పంచాయతీలకు మూడో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో 7 గ్రామ పంచాయతీలు ఎన్నికలు ఏకగ్రీవం కాగా, 68 గ్రామపంచాయతీలు, 700 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 
    
వనపర్తి జిల్లాలోని చిన్నంబావి, పాన్​గల్, పెబ్బేరు, శ్రీరంగాపూరు, వీపనగండ్ల మండలాల్లో 87 సర్పంచ్, 806 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే చిన్నంబావి మండలంలో గడ్డబస్వాపూరు, పాన్​గల్​లో దావాజిపల్లి, బహదూర్​గూడెం, పెబ్బేరులో పెంచికలపాడు, రామమ్మపేట, రాంపూరు సర్పంచ్ స్థానాలు, 104  వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.  దీంతో 81 సర్పంచ్, 702 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 
    
నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, బల్మూరు, లింగాల, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, చారకొండ మండలాల్లోని 134 గ్రామ పంచాయతీల్లో మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం158 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా,18 గ్రామాల సర్పంచ్​లు ఏకగ్రీవమయ్యారు. 6 గ్రామాల్లో సింగిల్ నామినేషన్ దాఖలు చేయలేదు. పోలింగ్ జరిగే 134 సర్పంచ్ స్థానాలకు 414 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,364 వార్డులకు, 252 ఏకగ్రీవం కాగా, 44 వార్డుల్లో సింగిల్ నామినేషన్ దాఖలు కాలేదు. 1,064 వార్డుల్లో 2.707 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 

జోరుగా ప్రచారం..

ఉమ్మడి జిల్లాలో జరిగిన మొదటి, రెండో విడత సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుతో పోటీ చేసిన క్యాండిడేట్లకు ఓటర్లు పట్టం కట్టారు. దీంతో మెజార్టీ సర్పంచ్​ స్థానాల్లో ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. అయితే చివరి రోజు సోమవారం ఆయా గ్రామాల్లో వివిధ పార్టీ నాయకులు జోరుగా ప్రచారం 
నిర్వహించారు.