‘దీన్ దయాళ్’ పురస్కారాలు తిరస్కరించిన సర్పంచ్​లు

‘దీన్ దయాళ్’ పురస్కారాలు తిరస్కరించిన  సర్పంచ్​లు

కొమురవెల్లి, వెలుగు :  కొమురవెల్లిలోని ఎంపీడీఓ ఆఫీసులో శుక్రవారం దీన్​దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కరాలను పలు గ్రామాల సర్పంచ్​లు తిరస్కరించారు. శుక్రవారం కొమురవెల్లి ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని తొమ్మిది మంది సర్పంచ్​లకు అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి బీఆర్ఎస్ పార్టీకే చెందిన కిష్టంపేట సర్పంచ్​ భీమనపల్లి కర్ణాకర్​ గైర్హాజరయ్యారు. అధికారుల బలవంతం మీద ఐనాపూర్, రాంసాగర్ సర్పంచులు అవార్డులు తీసుకున్నా ఆఫీసులోనే వదిలిపెట్టి  వెళ్లిపోయారు. ఎంపీడీవో ఆఫీసుకు వచ్చిన రాంసాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్, ఐనాపూర్ సర్పంచ్ రమణారెడ్డి మాట్లాడుతూ తమ గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులివ్వకుండా, అవార్డులిస్తే ఏం చేస్కోవాలని ప్రశ్నించారు. తనకు రూ. 30 లక్షల బిల్లులు రావాల్సి ఉందని ఐనాపూర్​ సర్పంచ్​ రమణారెడ్డి చెప్పగా, తనకు రూ.9 లక్షలు పెండింగ్​లో పెట్టారని రాంసాగర్ సర్పంచ్​ రవీందర్​ చెప్పారు. తమకు అవార్డు అవసరం లేదనడంతో  మండల స్పెషల్ ఆఫీసర్​ రవికుమార్ వారికి సర్ది చెప్పారు.

దీంతో అవార్డులను తీసుకుని నిరసనగా ఎంపీడీవో ఆఫీసులోనే వదిలిపెట్టి పోయారు. కార్యక్రమానికి హాజరురాని కిష్టంపేట సర్పంచ్ కర్ణాకర్ మాట్లాడుతూ తాను అప్పులు చేసి రూ.18 లక్షల వరకు పనులు చేయించానని, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఎంపీవో మంజుల కూడా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తూ ఇబ్బంది పెడుతున్నదన్నారు. ఈ కారణాలతోనే అవార్డు తీసుకోలేదన్నారు. ఎంపీపీ తలారి కీర్తన, ఎంపీడీఓ అనురాధ, జడ్పీటీసీ సిద్దప్ప, వైస్ ఎంపీపీ రాజేందర్,
సూపరింటెండెంట్​రాంప్రసాద్  పాల్గొన్నారు.