రష్యా–ఉక్రెయిన్​ యుద్ధానికి రెండేండ్లు

రష్యా–ఉక్రెయిన్​ యుద్ధానికి రెండేండ్లు

రెండవ ప్రపంచ యుద్ధం (1939-–45) నేపథ్యంలో 1945లో సంక్షోభాల నివారణ ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) ఏర్పడింది. అయితే, పలు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలు, యుద్ధ వాతావరణం, ప్రత్యక్ష యుద్ధాలను నిలువరించడంలో యూఎన్ఓ విఫలం అవుతున్నట్లు గత చరిత్ర రుజువు చేస్తున్నది. 1914–19 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాల ఉమ్మడి వేదికగా యుద్ధాల నివారణ ఉద్దేశంతో “లీగ్‌‌ ఆఫ్‌‌ నేషన్స్‌‌” అనే సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఆపలేకపోయింది. దీంతో 1945లో పెద్ద ఎత్తున ఐరాస ఏర్పడి నేటికీ కొనసాగుతున్నది. ఐరాస తన ప్రస్థానంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ సంక్షోభాలను నిలువరించడంలో  విఫలం కావడం, కాగితాలకు మాత్రమే పరిమితం కావడం విచారకరం. 

యుద్ధాల ముగింపులో యూఎన్​ఓ ప్రేక్షక పాత్ర

2022 ఫిబ్రవరి 24న ప్రారంభమై గత రెండేండ్లుగా కొనసాగుతున్న భీకర ఉక్రెయిన్‌‌ –- రష్యా యుద్ధం ముగింపేలేని నిప్పుల కొలిమివలె కాలుతూ ఉన్నది. ఈ భీకర యుద్ధంలో ఇరుపక్షాల నుంచి 1.3 లక్షల ప్రాణాలు కోల్పోవడం, 4 లక్షల వరకు గాయపడడం జరిగింది. ఉక్రెయిన్‌‌ –- రష్యా యుద్ధానికి ముగింపు పలకడానికి 23 ఫిబ్రవరి 2023న నిర్వహించిన అత్యవసర యూఎన్ఓ సర్వసభ్య సమావేశంలో యుద్ధాన్ని వెంటనే బేషరతుగా ఆపాలని 141 దేశాలు కోరగా, 7 దేశాలు వ్యతిరేకించాయి.  32 దేశాలు ఓటింగులో పాల్గొనలేదు. మెజారిటీ సభ్యులు యుద్ధం ఆపాలంటూ రష్యాను కోరినప్పటికీ యూఎన్ఓ తీర్మానం ఏ విధమైన ప్రభావాన్ని చూపలేదు. 7 అక్టోబర్ 2023‌‌న  ప్రారంభమైన ఇజ్రాయెల్‌‌,- హమాస్‌‌ యుద్ధం కూడా గత నాలుగు మాసాలకు పైగా కొనసాగుతున్నది.  పాలస్తీనా ప్రాంతాలు నేల మట్టం కావడం, పిల్లలు సహితం ప్రాణాలను కోల్పోవడం, ఆవాస ప్రాంతాల్లో కూడా దాడులు జరగడంతో 29,000 వరకు పాలస్తీనీయన్లు, 1,410 ఇజ్రాయిలీల ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధాన్ని యూఎన్​ఓ తో పాటు మానవాళి కూడా మౌనంగా చూస్తూనే ఉన్నది. 

అడ్డుపడుతున్న యూఎన్​ఓ భద్రతా మండలి వీటో పవర్‌‌

 యూఎన్​ఓ భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్‌‌) సభ్య దేశాలకు వీటో పవర్‌‌ ఉండడం, శాశ్వత సభ్యుల మధ్య విభేదాలు ఉండడంతో ఉక్రెయిన్‌‌– - రష్యా యుద్ధానికి యూఎన్ఓ ముగింపు పలకలేకపోతున్నది. బలమైన దేశాలు భద్రతా మండలిలో సభ్యులు కావడం, ఆ సభ్యులకు వీటో పవర్‌‌ ఉండడంతో సంక్షోభాల పరిష్కారం ఎండమావిగా తోస్తున్నది. ఇలాంటి సందర్భాల్లో యూఎన్ఓ ప్రేక్షక పాత్రను వహించడం, పీస్‌‌ కీపింగ్‌‌ మిషన్స్‌‌ పంపడానికి మాత్రమే పరిమితం కావడంతో యుద్ధాలకు ముగింపు కనిపించడం లేదు. యూఎన్ఓ భద్రతా మండలిలో సభ్యత్వం ఉన్న 5 దేశాల నిర్ణయాలు మాత్రమే పరిష్కారానికి అర్హత కలిగి ఉన్నాయి. మిగిలిన 190 సభ్య దేశాల అభిప్రాయాలకు విలువ లేకుండా పోతున్నది. ఐదు సభ్య దేశాలు ఏకాభిప్రాయాలకు రాకపోవడంతో యూఎన్ఓ ఏర్పాటు ఉద్దేశాలు నీరుగారిపోతున్నాయి.

భద్రతా మండలిని విస్తరించలేమా
 
భద్రతా మండలిని విస్తరించి భారత్‌‌ లాంటి మరి కొన్ని దేశాలను భద్రతా మండలిలోకి శాశ్వత సభ్యులుగా తీసుకోవడం, వీటో పవర్‌‌ సూత్రాన్ని తొలగించి మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను విధిగా అమలు పరచడం, భద్రతా మండలి సభ్యత్వాలను కాలపరిమితులతో మార్చడం, పీస్‌‌ కీపింగ్‌‌ మిషన్స్ స్వతంత్రంగా పని చేయడం, దౌత్య పరిష్కారాలను వెతకడం లాంటి సంస్కరణలు తీసుకుంటేనే యూఎన్​ఓ నిర్ణయాలకు విలువ ఉంటుంది, ప్రపంచ శాంతి నీడ భూగోళ మానవాళిని సంరక్షిస్తుంది.  యూఎన్​ఓ ఉద్దేశాలు ఆదర్శప్రాయంగా ఉన్నప్పటికీ వాటి అమలుకు నియమనిబంధనల సంకెళ్లు పడడంతో యుద్ధాలను నిలువరించడంలో యూఎన్​ఓ ప్రేక్షక పాత్రగా మిగిలిపోవడం విచారకరం, ఆక్షేపణీయం. 

-  డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, 
ఎనలిస్ట్​