బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేది బీజేపీనే!: సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య

 బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేది బీజేపీనే!:  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య

ఏటూరునాగారం, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వకుండా కేంద్రం తొక్కిపెడుతుందని  సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు అనుకూలమే అంటూ బీజేపీ, కేంద్రంలో అడ్డుకుంటూ ద్వంద్వ వైఖరి చూపుతుందని మండిపడ్డారు. ఏటూరునాగారంలో గురువారం పార్టీ జిల్లా కమిటీ నిర్వహించిన మీడియా  సమావేశంలో ఆయన మాట్లాడారు. 

స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వివాదాస్పదంగా మారిందిందన్నారు.  నామినేషన్ల చివరిరోజు హైకోర్టు తీర్పుతో ఎన్నికలు ఆగిపోవడం కేంద్రం కుట్రే అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అసెంబ్లీ ముందు ఉంచితే బీజేపీతో సహా ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. కేంద్రం తక్షణమే 42శాతం రిజర్వేషన్​అమలుకు నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

.మేడారం శాశ్వత పనుల్లో మంత్రుల కొట్లాటే తప్ప ఏ ఫురోగతి లేదని ఆరోపించారు. ప్రధాని మోదీకి దేశంకంటే అమెరికాపైనే ఎక్కువ ప్రేమ ఉన్నట్లుగా కనిపిస్తోందని, ట్రంప్​చేతిలో కీలుబొమ్మలా మారారని విమర్శించారు. రాష్ట్రంలోని ఉద్యోగులు వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులు చూసుకోకుంటే వేతనాలు కట్ చేస్తామన్న సీఎం వ్యాఖ్యలు సరైనవే అయినా.. ఎందుకు సరిగా చూసుకోలేకపోతున్నారో ఒక అధ్యయనం చేసి సమస్యలను పరిష్కరిస్తే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు.

 ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి, ఎండీ.దావూద్, రత్నం రాజేందర్, కొప్పుల రఘుపతి, జిల్లా నేతలు రత్నం ప్రవీణ్ పాల్గొన్నారు.