బీఆర్ఎస్  గెలిస్తే రైతులు గెలిచినట్లే : నిరంజన్​రెడ్డి

బీఆర్ఎస్  గెలిస్తే రైతులు గెలిచినట్లే : నిరంజన్​రెడ్డి

వనపర్తి, వెలుగు: తెలంగాణ రాక ముందు సేద్యం ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లుందనే ప్రశ్నించుకొని కారు గుర్తుకు ఓటేయాలని, బీఆర్ఎస్​ గెలిస్తే రైతులు గెలిచినట్లేనని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పలు మండలాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గం ఎత్తులో ఉందని గత పాలకులు సాగు నీళ్లు తేలేక ఇక్కడి రైతులను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.

2014 ఎన్నికల్లో తాను ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉంటూ అన్ని గ్రామాలకు సాగునీరు తెచ్చి రైతులకు అండగా ఉన్నానని చెప్పారు. తాను చేసిన  ప్రతి పని రేపటి భవిష్యత్తుకు ఉపయేగపడేదేనన్నారు. పాలు ఇచ్చే బర్రెను అమ్మి పనికిమాలిన దున్నను ఎన్నుకోవద్దని కోరారు. వనపర్తిలో  ముందు చూపుతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని, వాటిని పూర్తి చేసి ఇక్కడి యువతకు, మహిళలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాంగ్రెస్  హయాంలో రైతులకు  కరెంట్  కష్టాలు వస్తాయని, ప్రజల జీవితాలు ఆగం అవుతాయని హెచ్చరించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ రైతు బీమా తరహాలో కొత్తగా కేసీఆర్  భీమా పథకం  అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

మళ్లీ బీఆర్ఎస్  గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  రైతు బంధు ద్వారా పెట్టుబడి సాయాన్ని అందకుండా చేసిన కాంగ్రెస్ కు ఈసీ షాక్ ఇచ్చిందని, రైతులకు రేపటి నుంచి అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. పెద్దమందడి మండలంలోని జగత్ పల్లి, మనిగిళ్ల, మోజర్ల, మదిగట్ల, అమ్మపల్లి, ఆల్వాల, చిన్న మందడి, దొడగుంట పల్లి, అంకాయపల్లి తండా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.