విశ్వాసం : సత్యమేవ జయతే

 విశ్వాసం : సత్యమేవ జయతే

మానవజాతి సన్మార్గంలో ప్రయాణం చేయడానికి ఆధారభూతమయిన వేదం మనిషి ఏ విధంగా జీవించాలనే విషయాన్ని, ‘సత్యం వద’ అని శాసనం చేసింది. సత్యాన్ని నోటితో పలకాలి’ అని ఈ వాక్యార్థం. సత్యభాషణం గొప్పది అని ఒక్కమాటలో పండితులు చెప్పారు. దానిని సామాన్యులు అర్థం చేసుకునే విధంగా నన్నయ తెలుగు భారతం ‘శాకుంతలోపాఖ్యానం’ లో వివరించాడు.

కణ్వమహర్షి ఆశ్రమంలో ఉన్న శకుంతలను దుష్యంత మహారాజు మోహించి, గాంధర్వ వివాహం చేసుకుని, త్వరలోనే వచ్చి తీసుకుని వెళ్తానని మాట ఇచ్చి వెళ్లిపోతాడు. కొంతకాలానికి శకుంతల ఒక కుమారుడికి జన్మనిస్తుంది. అంత కాలం గడిచినా దుష్యంతుడు తిరిగి రాకపోవటంతో, కణ్వమహర్షి తన శిష్యులనిచ్చి శకుంతలను రాజు దుష్యంతుని దగ్గరకు పంపాడు. అక్కడ దుష్యంతుడు శకుంతలను చూసి, ఆమె ఎవరో తనకు తెలియదంటాడు. ఆ సందర్భంలో శకుంతల పలికిన మాట ఇది.

నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత
వ్రత యొక బావి మేలు మరి బావులు నూరిటి కంటెనొక్క స
త్క్రతువది మేలు తత్క్రతు శతంబున కంటె సుతుండు మేలు త
త్సుత శతంబు కంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్‌

(నన్నయ భారతం ఆదిపర్వం, చతుర్థాశ్వాసం, 93వ పద్యం)

సత్యం అత్యంత శక్తివంతమైన ఆయుధం. సమాజానికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగించేది సూనృతవాక్యం. సత్యవాక్య మహిమ ఎంతటితో తెలియటానికి ఈ పద్యమే నిదర్శనం.సత్యమేవ జయతే అని మన వేదాలు చెప్తున్నాయి. అంటే... ఎప్పటికైనా సత్యం మాత్రమే జయిస్తుంది అని అర్థం. శకుంతల సత్యమే పలికింది. ఆ విషయాన్ని అశరీరవాణి చెప్పటంతో, దుష్యంతుడు శకుంతలను, వారి సంతానం భరతుడిని అక్కున చేర్చుకున్నాడు. అలా సత్యమే జయించింది.  వాస్తవానికి నిజం వినటానికి  చేదుగా ఉంటుంది. కానీ అబద్ధం తియ్యగా ఉంటుంది. సక్రమ మార్గంలో పయనించడానికి సత్యం ప్రధానం. ఇతరులకు హాని కలిగించనంతవరకు సత్యం పలకాలని వేదాలు చెప్తున్నాయి. సత్యం అత్యంత శక్తివంతమైన ఆయుధం. రామాయణ ఇతిహాసం సత్యవాక్యం మీదనే నడుస్తుంది. రాముడికి సత్యవాక్పాలకుడని పేరు. ఆయన అనునిత్యం సత్యవాక్యాలను మాత్రమే పలికేవాడు. సత్యాన్ని పలికిన హరిశ్చంద్రుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆలుబిడ్డలను కోల్పోయాడు. సర్వం పోగొట్టుకున్నాడు. చివరకు విశ్వామిత్రుడు ఆ సత్యానికి లొంగాడు. సత్యవాక్కుకి అంతటి మహత్తు ఉంది. అందుకే హరిశ్చంద్రుడు చరిత్రలో సత్య హరిశ్చంద్రుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు.

‘ఆవు – పులి’ కథలో ఆవు అడవిలో గడ్డి మేస్తుండగా పులి వచ్చి ఆవుని చంపుతానంది. అప్పుడు ఆవు ‘ఇంటికి వెళ్లి, నా బిడ్డకు కడుపు నిండా పాలు ఇచ్చి వస్తా’ అని పలికింది. ఆ మాటలకు పులి నవ్వింది. ‘నేను అసత్యమాడను. తప్పక వస్తాను’ అని పులిని ఒప్పించి ఇంటికి వెళ్లింది. దూడకు పాలిచ్చి, జాగ్రత్తలు చెప్పింది. చెప్పిన సమయానికే పులి దగ్గరకు వెళ్లింది. ఆవు నిజాయితీకి పులి ఆశ్చర్యపోయింది. ఇంతటి సత్యం పలికిన ప్రాణిని భుజించటం వలన తనకు పాప దోషం అంటుతుందని ఆవుని వదిలేస్తుంది. అంతటి మహత్యం నిజాయితీకి ఉంది. అంతటి క్రూర జంతువు సైతం సత్యానికి భయపడింది.

సత్యనిష్ఠతో జీవించేవారి వాక్కుకి, చూపుకి ఎంతో శక్తి ఉంటుందని పెద్దలు చెప్తారు. అందుకే వారు శపించినా, ఆశీర్వదించినా వాటికి తప్పక ఫలితం ఉండి తీరుతుంది. శాపాలు, వరాలు ఇచ్చే మహర్షులు త్రికరణశుద్ధిగా సత్యాన్నే పలుకుతారు. ప్రహ్లాదుడు హాస్యానికైనా అసత్యమాడేవాడు కాదని పోతన భాగవతంలో ఉంది. అనవసరంగా అసత్యం పలకటం వల్ల బుద్ధి శక్తి దెబ్బ తింటుందని పరిశోధనల్లో వెల్లడైంది. భగవంతుని సత్యస్వరూపుడిగా భావిస్తుంది భారతీయ సనాతన ధర్మం. మహాత్మాగాంధీ ‘మై ఎక్స్​పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌’ అంటే ‘సత్యశోధన’ అనే పుస్తకం రచించాడు. 

‘నీతి నిజాయితీ’ ‘నీరు పల్లమెరుగు – నిజము దేవుడెరుగు’ వంటి భాషా ప్రయోగాలు తెలిసినవే.

‘మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణము సుభటకోటి ధరిత్రిన్‌
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబువ్రాలు సిద్ధము సుమతీ’ 

అని సత్యవాక్యం గురించి సుమతీ శతకకారుడు బద్దెన వివరించాడు.

- డా. వైజయంతి పురాణపండ
ఫోన్​ :80085 51232