సౌదీ వచ్చి బిజినెస్ పెట్టుకోండి

సౌదీ వచ్చి బిజినెస్ పెట్టుకోండి

సౌదీ రాయబారి సాద్‌ అల్‌ సతి

హైదరాబాద్‌, వెలుగు: అన్ని రంగాల్లోనూ ఇండియా తమకు కీలక భాగస్వామి అని,  కలిసి పనిచేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మనదేశంలో సౌదీ అరేబియా రాయబారి సాద్‌‌ అల్‌‌ సతి అన్నారు.  ఇండియన్లకు తమ దేశంలో ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఫిక్కీ తెలంగాణ స్టేట్‌‌ కౌన్సిల్‌‌ హైదరాబాద్‌‌లో సోమవారం ‘‘స్కోప్‌‌ ఆఫ్ ఇండో–సౌదీ బైలటేరల్‌‌ ట్రేడ్‌‌ ఇన్‌‌ వ్యూ ఆఫ్‌‌ పొలిటికల్‌‌ రిలేషన్స్‌‌’’ పేరుతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  సౌదీలో వ్యాపారం నిర్వహించడానికి ఈ ఏడాది తొలి క్వార్టర్‌‌లోనే 267 విదేశీ కంపెనీలకు లైసెన్సులు ఇచ్చామని చెప్పారు. తమ  దేశంలో వ్యాపారాలకు అపార అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్‌‌ కంపెనీలను ఆకర్షించడానికి రెసిడెన్సీ స్కీమ్‌‌ను ప్రవేశపెట్టామని వివరించారు. ఇండియన్​ బిజినెస్​ మెన్​ కూడా సౌదీకొచ్చి వ్యాపారాలు చేసుకోవాలని ఆహ్వానించారు.

ఇండియాలోని ఆయిల్‌‌ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నామని, రిలయన్స్‌‌లో 20 శాతం వాటా కొన్నామని అల్​సతి చెప్పారు. వెస్ట్‌‌కోస్ట్‌‌ రిఫైనరీని నిర్మించడానికి ఆరామ్‌‌కో, అబూ ధబీ నేషనల్‌‌ ఆయిల్‌‌ కంపెనీ చేతులు కలిపాయని వెల్లడించారు. ‘‘మన రెండు దేశాల మధ్య శతాబ్దాల నాటి నుంచే అన్ని రంగాల్లో సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాలు ఎప్పడూ దోస్తులే. మా ‘విజన్‌‌ 2030’లో ఇండియాకు కీలక స్థానం ఉంటుంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మా యువ రాజు మహ్మద్‌‌ బిన్ సల్మాన్‌‌ను జీ–20 సదస్సు సందర్భంగా కలిశారు. వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవడానికి ఇరువురూ చర్చించారు. ఇరు దేశాలు కలిసి పనిచేయడానికి 40 వరకు అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. 2024 కల్లా ఇండియా ఐదు ట్రిలియన్‌‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి మా వంతు సాయం చేస్తాం. ఈ సందర్భంగా ఆయన పలు పరిశ్రమల అధిపతులతో చర్చించారు.