ఇకపై స్థానికులకే సౌదీలో ఉపాధి..

ఇకపై స్థానికులకే సౌదీలో ఉపాధి..

సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాస్పిటాలిటీ రంగంలో ఉద్యోగాలను తమ దేశ పౌరులకే కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆ రంగంలో ఉన్న విదేశీయులను ఈ ఏడాది చివరికల్లా తొలగించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కార్మిక శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. రిసార్ట్స్,  త్రి స్టార్  రేటింగ్ కు మించిన హోటళ్లు, ఫోర్ స్టార్ రేటింగ్ మించిన హోటల్ అపార్టమెంట్ లలో  కేవలం సౌదీ దేశీయులను మాత్రమే నియమించనున్నారు. కిందిస్థాయి నుంచి మేనేజ్ మెంట్ వరకు అన్నింట్లోను  వారికి ఉపాధి కల్పించనున్నారు. డ్రైవర్లు, డోర్ కీపర్ల్, పోర్టర్లు వంటి ఉద్యోగాల్లో మాత్రం విదేశీయులు కొనసాగేందుకు అవకాశం ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. విదేశీయులకు రెస్టారెంట్ హోస్ట్, హెల్త్ క్లబ్ సూపర్ వైజర్ ఉద్యోగాల్లో కోత విధించనున్నట్టు వెల్లడించారు.

పర్యాటక శాఖ అభివృద్ధి బాటలో నడిపించాలని భావిస్తున్న సౌదీ ప్రభుత్వం.. దేశంలోని నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గతేడాది నిరుద్యోగ శాతం 13 శాతానికి చేరింది. దీంతో ప్రభుత్వం హాస్పిటాలిటీ రంగంలో  సౌదీయులకు ఉపాధి కల్పించాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రైవేటు రంగంలో భారీ సంఖ్యలో ఉన్న విదేశీయుల సంఖ్యను తగ్గించవచ్చనేది కూడా ఈ ఆలోచనలో భాగమే.

దేశంలోని పౌరులకు ఉపాధి కల్పించాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. అయితే  ఈ నిర్ణయంపై పలువురు వ్యాపారవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ బిజినెస్ దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఇస్లామిక్ క్యాలెండర్ ను అనుసరించి డిసెంబర్ 29 నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు హోటళ్లు సౌదీ పౌరులను తమ సంస్థల్లో చేర్చుకుంటున్నాయి.