
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాకు చెందిన ప్రభుత్వ ఆయిల్ కంపెనీ అరామ్‌కో ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో 26 బిలియన్ డాలర్ల (రూ.2.23 లక్షల కోట్ల) లాభం ఆర్జించింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 4.6 శాతం తక్కువ. రియాద్‌లోని తదావుల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో చేసిన ఫైలింగ్ ప్రకారం, అరామ్‌కో ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌లో 108.1 బిలియన్ డాలర్ల (రూ.9.29 లక్షల కోట్ల) ఆదాయాన్ని సాధించింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో 107.2 బిలియన్ డాలర్ల ఆదాయంపై 27.2 బిలియన్ డాలర్ల లాభం పొందింది.
అరామ్‌కో షేర్ ధర గురువారం 6 డాలర్ల దగ్గర కదిలింది. కిందటేడాది నమోదు చేసిన 8 డాలర్ల స్థాయి నుంచి పడింది. ఆయిల్ ధరలు తగ్గడం, ఇటీవలి నెలల్లో ఒపెక్ ప్లస్ దేశాలు ప్రొడక్షన్ పెంచడం, అమెరికా టారిఫ్‌ల వల్ల మిడిల్ ఈస్ట్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో ఈ కంపెనీ షేర్లు పడుతున్నాయి. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ శుక్రవారం బ్యారెల్‌కు 63 డాలర్ల దగ్గర ట్రేడ్ అయింది. ఇది కిందటేడాది 80 డాలర్లకు పైన కదిలింది.