- జీడీపీలో 6.2 శాతానికి సమానం
- క్రెడిట్ కార్డ్, పర్సనల్ , వెహికల్ లోన్లే ఎక్కువ
- క్లయింట్ అసోసియేట్స్ వెల్లడి
కరోనా సంక్షోభం తర్వాత ఇండియాలో కుటుంబాల అప్పులు భారీగా పెరిగాయి. ఫలితంగా సేవింగ్స్ తగ్గిపోయాయి. హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ ఖర్చులు భారీగా పెరిగాయి. కుటుంబాలు అప్పులు తీసుకోవడం ఏడాదికి 44.6 % చొప్పున పెరిగింది.
న్యూఢిల్లీ: ఇండియాలో కుటుంబాల అప్పులు కరోనా సంక్షోభం తర్వాత భారీగా పెరిగాయి. ఫలితంగా సేవింగ్స్ తగ్గిపోయాయి. సేవింగ్స్ రేటు జీడీపీలో సుమారు 30శాతం వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ, పెట్టుబడి పెట్టడానికి నిజంగా అందుబాటులో ఉన్న డబ్బు మాత్రం దశాబ్దాల కనిష్టానికి పడిపోయింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కుటుంబాల నెట్ ఫైనాన్షియల్ సేవింగ్స్ జీడీపీలో5.2శాతంగా నమోదైంది.
ఇది కరోనా సంక్షోభానికి ముందు 7.7శాతంగా ఉంది. క్లయింట్ అసోసియేట్స్ (సీఏ) విడుదల చేసిన “ది న్యూ ఇండియన్ హౌస్‌హోల్డ్ బ్యాలెన్స్ షీట్’’ అనే వైట్ పేపర్ ప్రకారం, కుటుంబాలు ఫిజికల్ అసెట్స్‌లో పెట్టుబడి పెట్టడంతో కూడా చేతిలో ఉండే డబ్బు తగ్గింది.
- తక్కువ వడ్డీ కావడంతో అప్పులు..
కుటుంబాల అప్పులు 2023–24 నాటికి జీడీపీలో 6.2శాతానికి చేరాయి. గత దశాబ్దంలో ఇదే ఎక్కువ. కరోనాకు ముందు ఇది 4.1శాతంగా ఉంది. హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ ఖర్చులు భారీగా పెరిగాయి. కుటుంబాలు అప్పులు తీసుకోవడం ఏడాదికి 44.6 శాతం చొప్పున, సేవింగ్స్ కంటే వేగంగా పెరిగింది.
సీఏ రిపోర్ట్ ప్రకారం, భారతీయ కుటుంబాలు ఇప్పుడు అప్పులను అత్యవసరాలకు మాత్రమే కాకుండా, లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవడానికి, ఆస్తులు కొనడానికి, వినియోగానికి కూడా తీసుకుంటున్నాయి. అదే సమయంలో తమ సేవింగ్స్‌లో పెద్ద భాగాన్ని రియల్ ఎస్టేట్ వంటి ఫిజికల్ అసెట్లలో పెడుతున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత ఫిజికల్ అసెట్లపై కుటుంబాల ఫోకస్ పెరిగింది. 2023–24లో సేవింగ్స్‌లో 70శాతం వాటా వీటిలోకి వెళ్లింది. కరోనాకు ముందు ఈ వాటా 58–60శాతంగా ఉంది.
కుటుంబాల వాటా 60 శాతం
-1 ఇండియా మొత్తం డొమెస్టిక్ సేవింగ్స్‌లో సుమారు 60శాతం కుటుంబాల నుంచి ఉంది. ప్రతి ఏడాది జీడీపీలో 20 శాతంగా నమోదవుతోంది. దేశీయంగా క్యాపిటల్ అందడంలో కుటుంబాల సేవింగ్స్ కీలకంగా ఉన్నాయి.
2 రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 2023–24లో జీడీపీలో 12.8శాతానికి చేరాయి. టాప్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా రియల్టీ నిలిచింది. లోన్లపై వడ్డీ రేట్లు తగ్గడంతో ఇండ్ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి.
3 షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళ్లిన పెట్టుబడులు 2020 తో పోలిస్తే 2025 నాటికి మూడు రెట్లు పెరిగాయి.
4 డీమాట్ అకౌంట్స్ వాటా ఇండియా జనాభాలో 11 శాతంగా ఉంది. మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న ఆస్తులు (అసెట్ అండర్ మేనేజ్‌మెంట్) జీడీపీలో 18.2శాతానికి చేరింది. అమెరికాలో ఇది 131.7శాతంగా ఉంది. ఇండియాలో గ్రోత్‌కు అవకాశాలు ఉన్నాయి.
- ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
1 కేవలం రియల్ ఎస్టేట్‌లోనే ఇన్వెస్ట్ చేయకూడదు. ప్రాపర్టీలతో సంపద పెంచుకోవచ్చు. కానీ, ప్రాపర్టీలను అమ్మి వెంటనే ఫండ్స్ సేకరించడం వీలుకాకపోవచ్చు. ఇంకా ఎక్కువ అమౌంట్‌ను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
2 అప్పులతో సంపద సృష్టించవచ్చు కానీ, జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగితేనే అది సాధ్యమవుతుంది.
3 ఫైనాన్షియల్ అసెట్స్ కీలకంగా మారుతున్నాయి. ఇన్వెస్టర్లు సిప్‌లు, షేర్లు, విభిన్న ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సంపద పెంచుకోవచ్చు.
4 సంపదను పెంచుకోవడానికి క్రమశిక్షణ, డైవర్సిఫికేషన్, రిస్క్ మేనేజ్‌మెంట్ కీలకం.

