సేవింగ్స్​కు ఆసరా అవసరం : మాజీ ప్రొ. జీ మోహన్‌‌

సేవింగ్స్​కు ఆసరా అవసరం : మాజీ ప్రొ. జీ మోహన్‌‌
  • బడ్జెట్‌‌పై మాజీ ప్రొఫెసర్ జీ మోహన్‌‌

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు: యూనియన్ బడ్జెట్ దగ్గరకు వస్తోంది. 2023–24  కు గాను వచ్చే నెల 1 న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌‌‌‌ ప్రవేశపెట్టనున్నారు. వివిధ ఇండస్ట్రీ వర్గాలు తాము ఏం కోరుకుంటున్నామో, తమకు ఏం కావాలో  విష్‌‌‌‌లిస్టును  మంత్రికి అందజేశాయి.  కానీ,  ఒక  వర్గానికి చెందిన వారి విష్‌‌‌‌లిస్టు మాత్రం ఆర్థిక మంత్రికి అందలేదనే చెప్పాలి. ఆ వర్గమే..సేవింగ్స్ చేసేవారు. అంటే ఫిక్స్డ్‌‌‌‌ డిపాజిట్లు, ప్రభుత్వ స్కీమ్‌‌‌‌లు, బాండ్లలో ఇన్వెస్ట్ చేసేవారు. వీరు బడ్జెట్ నుంచి ఏం కోరుకుంటున్నారో అడ్మినిస్ట్రేటివ్‌‌ స్టాఫ్‌‌  కాలేజ్‌‌ ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌‌ మాజీ ప్రొఫెసర్ జీ మోహన్ వివరించారు. మిగిలిన విషయాలు ఆయన మాటల్లోనే..

డిసెంబర్ నాటికి దేశంలో రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ 5.77 శాతం దగ్గర ఉంది. ఇన్‌‌‌‌ఫ్లేషన్ పెరగడంతో కిందటేడాది మే తర్వాత ఐదు సార్లు రెపో రేటును ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ పెంచింది.  దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరుకుంది.  కిందటేడాది మే నుంచి డిసెంబర్ మధ్య  ఈ కీలక వడ్డీ రేటు  2.25 శాతం పెరిగింది. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ కూడా పెరుగుతుంది. కానీ, బ్యాంకులు అప్పులపై వడ్డీ పెంచేంత వేగంగా  డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని పెంచడం లేదు.   కిందటేడాది జనవరిలో ఏడాది కాల వ్యవధి గల ఎస్‌‌‌‌బీఐ ఫిక్స్డ్‌‌‌‌ డిపాజిట్ల (ఎఫ్‌‌‌‌డీల) పై 5.10 శాతం వడ్డీ రాగా, ఈ నెలలో 6.75 శాతం వస్తోంది. అంటే 1.65 శాతం మాత్రమే పెరిగింది. ఈ పెరిగిన వడ్డీ కూడా కేవలం కొత్త డిపాజిటర్లకే వర్తిస్తోంది.  సేవింగ్స్‌‌ చేసేవారికి వచ్చే వడ్డీలో ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ను కూడా తీసేస్తే నెగెటివ్ రిటర్న్స్ ఉంటున్నాయి. అంటే ఫిక్స్డ్‌‌‌‌ డిపాజిట్ల వాల్యూ పెరగకపోగా తగ్గుతోంది. మహా అయితే  వాస్తవిక వడ్డీ 1 నుంచి 3 శాతం వరకే ఉంటోంది.  కేవలం డిపాజిట్ల వడ్డీపై ఆధారపడే వారు మరింత ఇబ్బంది పడుతున్నారు.  వీరు తమ ఇన్‌‌‌‌కమ్‌‌‌‌ బట్టి వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తోంది.  కిందటేడాది చాలా మంది తమ ఖర్చులను నెట్టుకు రావడానికి డిపాజిట్లను విత్‌‌‌‌డ్రా చేసుకోవడమో లేదా లోన్లు తీసుకోవడం వంటివి చేశారు. నేషనల్ సేవింగ్స్ స్కీమ్‌‌‌‌, ప్రావిడెంట్ ఫండ్‌‌‌‌, పోస్ట్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఫిక్స్డ్‌‌‌‌ డిపాజిట్లు వంటి  స్మాల్ సేవింగ్స్‌‌‌‌ స్కీముల్లో ఇచ్చే వడ్డీని ప్రభుత్వం ప్రతీ  మూడు నెలలకొకసారి సవరిస్తోంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు క్వార్టర్లలో వీటిపై వడ్డీని పెంచలేదు. మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో పెంచినా 0.1 శాతం నుంచి 1.10 శాతం మధ్యే పెంచారు. ఏడాది మొత్తానికి ఒకేసారి పెంచకపోవడం వలన ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ను ఎదుర్కోవడంలో పొదుపు చేసేవారికి ప్రభుత్వ సహకారం అంతంత మాత్రమే ఉంటోంది. 
ప్రస్తుతం ఫ్రీ ఫ్లోటింగ్ బాండ్ల రేటు 7.35 శాతంగా ఉంది. 

బడ్జెట్‌‌‌‌ నుంచి కోరుకుంటున్నవి ..

1. ప్రభుత్వ బ్యాంకు (పీఎస్‌‌‌‌బీ) ల్లో మెజార్టీ వాటా గవర్నమెంట్‌‌‌‌కే ఉంది. కాబట్టి డిపాజిట్ల రేట్లను వెంటనే పెంచాలని పీఎస్‌‌‌‌బీలకు  ఆదేశిలివ్వాలి. పొదుపు చేసేవారు ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో ఇది సాయపడుతుంది.

2.  ఫిక్స్డ్‌‌‌‌ డిపాజిట్లను మెచ్యూర్ కాకముందే క్లోజ్ చేసుకుంటే  బ్యాంకులు1 శాతం వరకు  పెనాల్టీని వేస్తున్నాయి. ఈ పెనాల్టీని రద్దు చేసేలా చూడాలి. లేకపోతే పెనాల్టీని ‌‌‌‌0.25 శాతం నుంచి 0.50 శాతం రేంజ్‌‌‌‌కి తగ్గించాలి.  ఇలా చేస్తే  ఇప్పటికే ఎఫ్‌‌‌‌డీలు చేసిన వాళ్లు కూడా కొత్త రేటుకి షిఫ్ట్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తారు.

3. సుకన్య సమృద్ధి యోజన, ప్రావిడెంట్ ఫండ్ వంటి స్మాల్‌‌‌‌ సేవింగ్స్ స్కీమ్‌‌‌‌ల వడ్డీలను వేగంగా పెంచాలి. రేట్లను తగ్గించేటప్పుడు చూపిస్తున్న వేగాన్ని పెంచేటప్పుడు కూడా చూపించాలి. శ్యామలా గోపినాథ్‌‌‌‌ కమిటీ రికమండ్ చేసినట్టు ఒకే మెచ్యూరిటీ కలిగిన ప్రభుత్వ బాండ్లపై ఇచ్చే వడ్డీ కన్నా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌‌‌‌పై ఇచ్చే వడ్డీ 0.25 శాతం నుంచి 1 శాతం ఎక్కువ ఉండాలి. 

4. స్మాల్ సేవింగ్స్‌‌‌‌ స్కీమ్స్  వడ్డీని ప్రతీ మూడు నెలలకొకసారి సవరిస్తున్నట్టే ఫ్లోటింగ్‌‌‌‌ రేట్ బాండ్లను ప్రతీ మూడు నెలలకొకసారి మార్చాలి. 

5. ప్రభుత్వం ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఇండెక్స్ బాండ్స్‌‌‌‌ను తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఈ బాండ్లు ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌పై 11.5 శాతం ఎక్కువ వడ్డీ ఇచ్చేలా చూడాలి.  ఇలా చేయడం ద్వారా సేవింగ్స్ చేసేవారు ఇన్‌‌‌‌ఫ్లేషన్ ఎదుర్కోవడమే కాకుండా హై రిటర్న్స్ పొందే వీలుంటుంది. 

 - జీ మోహన్