చిరుతల సావిత్రమ్మ...

చిరుతల  సావిత్రమ్మ...

బంగారు అన్నం తిన్నావా?’ అని ఆప్యాయంగా అడిగే సావిత్రమ్మ గొంతు వినపడితే చాలు... ఎంతదూరంలో ఉన్నా పరిగెత్తుకొచ్చి ఆమె చేతుల్లో వాలిపోతాయి ఆ పులి పిల్లలు. వాటితో పాటు మేమున్నాం అంటూ వస్తాయి సింహం, మిగతా జంతువుల పిల్లలు. దెబ్బలు తగిలి లేదా తల్లిని కోల్పోయిన ఆ మూగ జీవాలకు సావిత్రమ్మే అమ్మ. అందుకే ఆమె ఎన్​క్లోజర్​లోకి అడుగుపెట్టిందంటే చాలు వాటికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.

ఈ సావిత్రమ్మకి బన్నేరు​ఘట్ట బయలాజికల్​ పార్క్​లో పనిచేసే అవకాశం అనుకోకుండా వచ్చింది. అయితేనేం చాలా త్వరగా ఆ పార్క్​లో ఉన్న ఎన్నో జంతువుల పిల్లలకు అమ్మ అయిపోయింది. ఒక్క వేటుతో మనుషుల ప్రాణాలు తీసే పులి కూడా సావిత్రమ్మ గొంతులో ‘చిన్నూ’ అనే పిలుపు వినిపిస్తే చాలు... ఎప్పుడెప్పుడు అమ్మ ఒడిలో చేరిపోదామా? అని పరిగెత్తుకొస్తుంది ఓ బుజ్జి పులి పిల్ల. దాంతో పాటు మిగతా జంతువుల పిల్లకూనలు కూడా వచ్చి ఆమె కాళ్లను చుట్టేస్తాయి. అడవి జంతువులని చూస్తే ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరుగులు తీస్తాం. అలాంటిది సావిత్రమ్మ, చిన్నుల మధ్య ఉన్న అద్భుతమైన ఈ బంధం అరుదుగా కనిపిస్తుంది.

అనుకోకుండా వచ్చి....

బెంగళూరులో విధాన సౌధకు 20 కిలో మీటర్ల దూరంలో ఉంది బన్నేరు​ఘట్ట బయలాజికల్​ పార్క్​. 731 హెక్టార్లలో ఉన్న ఈ పార్క్​లో 2300 జంతువులు, 102 జాతులు ఉన్నాయి. వీటిలో సింహాలు, పెద్ద పులి, చిరుత పులులు, ఏనుగులు, గుడ్డెలుగులు వంటి ఎన్నో జంతువులు ఉన్నాయి. ఈ పార్కులో కనిపించే జంతువుల్లో చాలావరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడకు తెచ్చినవే. వాటికి పునరావాసం కల్పిస్తారు ఇక్కడ. ఆ కూనలకు ఎలాగైతే కొత్త జీవితం లభించిందో అలాగే సావిత్రమ్మకు కూడా కొత్త జీవిత ప్రయాణం మొదలైంది ఇక్కడ. 45 ఏండ్ల వయసు ఉన్న సావిత్రమ్మ ఇక్కడ ఉద్యోగం చేసేందుకు రావడం అనుకోకుండా జరిగింది. సావిత్రమ్మ భర్త ఈ పార్కులోనే పనిచేసేవాడు. అతను మరణించడంతో భర్త ఉద్యోగం ఆమెకు ఇచ్చారు. మొదట క్లీనింగ్​ స్టాఫ్​తో కలిసి పనిచేసేది. అయితే ఆమె పని, జంతువులతో ఆమె ప్రవర్తిస్తున్న తీరు అక్కడి ఆఫీసర్లను ఆకట్టుకుంది. దాంతో ఆమెను జూ హాస్పిటల్​లో కేర్​టేకర్​గా పంపించారు.

తల్లి ప్రేమ అందిస్తా

‘ఎలా ఉంటుంది మీ పని?’ అని ఆమెను అడిగితే ‘‘జూ హాస్పిటల్​కు ఉదయం పదిగంటలకు వెళ్తా. ఈ హాస్పిటల్​కు కర్నాటకలోని పలు ప్రాంతాల నుంచి జంతువుల పిల్లలు వస్తాయి. ఇక్కడకు వచ్చే వాటిలో కొన్ని గాయాలతో వస్తే మరికొన్ని తల్లిని కోల్పోయినవి ఉంటాయి. ఆ పరిస్థితుల్లో వాటికవి బతకలేవు. ఇక్కడ వాటికి తల్లి ప్రేమతో పాటు అవసరమైన ట్రీట్​మెంట్​ కూడా దొరుకుతుంది. అందుకే అవి త్వరగా కోలుకుంటాయి. నేను రాగానే పులి పిల్లల్ని  ‘

చిన్నూ, బంగారు బాగున్నారా?’ అని అడుగుతా. అవి అరుస్తూ నా దగ్గరకు ప్రేమగా వస్తాయి. వాటితో కొంత టైం ఉన్నాకే నా పనిలోకి వెళ్తా. నేను అడుగుపెట్టగానే పులి పిల్లలు కాళ్లను చుట్టేస్తాయి. గారం పోతాయి. కాసేపు వాటి వీపు మీద ప్రేమగా నిమిరి, ముద్దు చేశాక ఎన్​క్లోజర్​ శుభ్రం చేస్తాం. ఆ తరువాత పిల్లలకు పాలు పడతా. మళ్లీ వాటితో కాసేపు ఆడుకుని నిద్రపుచ్చుతా” అని చెప్పింది సావిత్రమ్మ.

వారం రోజులు ఏమీ తినలేదు

పులి పిల్లలకు మేకపాలు, చికెన్​ పెడతారు. ఒక్కో పిల్ల ఆరోగ్యం చెక్​ చేస్తారు. ఆరోగ్యం బాగాలేని వాటిని వేరుగా ఉంచి, ట్రీట్​మెంట్​ చేస్తారు. జూ హాస్పిటల్​లో స్టేట్​ ఆఫ్​ ది ఆర్ట్​ లాబొరేటరీ ఉంది. ఇందులో ఆపరేషన్​ థియేటర్​, రేడియాలజీ ల్యాబ్​, పోస్ట్​ మార్టమ్​ ఫెసిలిటీస్​ ఉన్నాయి. పులి పిల్లలకు ఆరు నెలల వయసు రాగానే పార్క్​లోని సఫారీ ఏరియాకు వాటిని పంపిస్తారు. అయితే అది సావిత్రమ్మకు, హాస్పిటల్​లో ఇతర కేర్​ టేకర్లకు కాస్త కష్టంగా అనిపిస్తుంది.  ఆ విషయం గురించి సావిత్రమ్మ మాట్లాడుతూ ‘‘పులి పిల్లలను కొత్త ప్లేస్​కు పంపించాలంటే నాకు ఏడుపొస్తుంది. అక్కడి వాళ్లు ఈ పిల్లలను ఎలా చూసుకుంటారో ఏమో అనే బెంగ ఉంటుంది. అందుకనే ఏ రోజైతే వాటిని రిలొకేట్​ చేస్తారో ఆ రోజు ఆ వైపు పోను. 

మనసులో వాటిని ఒక్కసారి చూడాలి అని గట్టిగా అనిపిస్తుంది. అయినా అటు పక్కకు పోను. ఆ మధ్య చిరుతపులి పిల్లలను మూడింటిని బళ్లారికి పంపించాం. అక్కడికెళ్లాక అవి వారం రోజులు ఏమీ తినలేదు. ఆ విషయం విన్నప్పుడు నా మనసుకు చాలా కష్టంగా అనిపించింది. అక్కడి వాళ్లు నాకు ఫోన్​ చేసి చిరుత పిల్లలతో మాట్లాడమన్నారు. అవి ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగైతే బుజ్జగిస్తూ మాట్లాడేదాన్నో అలానే ఫోన్​లో మాట్లాడాను. ‘చిన్ను, బంగారు తిన్నారా? బాగున్నారా?’ అని అడిగాను. ఆ తరువాత నుంచి అవి తినడం మొదలుపెట్టాయి” అని చెప్పింది. మొత్తం 80 వరకు వేరు వేరు జంతువుల పిల్లలను సాకింది సావిత్రమ్మ . గాయపడిన, తల్లిలేని జంతువుల పిల్లలను ఇప్పుడు చాలా వరకు బన్నేరుఘట్ట పార్క్​కు పంపిస్తున్నారు. అక్కడ వెటర్నరీ డాక్టర్లు అందించే మంచి వైద్యంతో పాటు కేర్​టేకర్లు ఇస్తున్న కేర్ అందుకు కారణం.

జాగ్రత్తగా చూడాలి

‘‘మొదటి మూడు నెలలు చాలా ముఖ్యం. అవి పాలు తాగాయా? లేదా? తెలుసుకునేందుకు వాటి మూతులు గమనిస్తాం. కొన్ని చిరుతపులి పిల్లలు అయితే కళ్లు కూడా తెరవకముందే ఇక్కడికి తీసుకొస్తారు. వాటికి పాలు ఎలా తాగాలో కూడా తెలియదు. అందుకని నెమ్మదిగా ఒక మిల్లి లీటరు, రెండు మిల్లి లీటర్లు పాలు పడుతూ పాలు తాగడం అలవాటు చేస్తాం. పాలు పట్టేటప్పుడు ముక్కులోకి వెళ్తే ఊపిరాడక చచ్చిపోయే ప్రమాదం ఉంది. పాలు పట్టడానికి ఒక పద్ధతి ఉంటుంది. వాటిని ఒళ్లో పడుకోబెట్టుకుని నెమ్మదిగా పట్టాలి. ఆ పనంతా సావిత్రమ్మ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది” అని చెప్పారు బన్నేరుఘట్ట బయలాజికల్ పార్క్ వెటర్నరీ డాక్టర్ ఉమాశంకర్​.

‘‘నాకు జంతువులంటే చాలా ఇష్టం. వాటిని సొంత పిల్లల్లా చూసుకుంటా. చాలామంది ‘పులుల్ని దగ్గరకు తీయడం భయంగా అనిపించదా?’ అని అడుగుతారు. అవి ఎప్పుడు? ఎలా? ఉంటాయో తెలిస్తే భయపడాల్సిన అవసరం ఉండదు. చిరుత పులులు వయసు పెరిగాక దూకుడుగా ఉంటాయి. మామూలుగా అయితే పులులు మాతో బాగానే ఉంటాయి. చూడగానే దగ్గరకొచ్చి కౌగిలించుకుంటాయి. అదే సింహాలు అయితే మన చుట్టూరా నడుస్తూ తిరుగుతాయి.’’