ఎస్‌బీఐ కొత్త రూల్స్.. జూలై 1 నుంచే అమలు

ఎస్‌బీఐ కొత్త రూల్స్.. జూలై 1 నుంచే అమలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ చార్జీలను రివైజ్ చేసింది. క్యాష్ విత్‌డ్రా విషయంలో కొత్త మార్పులు చేసింది. ఇకపై ఎస్‌బీఐ బ్రాంచ్ ఏటీఎంలతోపాటు మిగిలిన ఏటీఎంల్లో నాలుగుసార్లు మాత్రమే డబ్బులను ఉచితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆపై క్యాష్ విత్‌‌డ్రా చేసుకుంటే అదనపు చార్జీలను కట్టాల్సి ఉంటుంది. వీటితోపాటు చెక్‌ బుక్, మనీ ట్రాన్స్‌‌ఫర్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌పైనా ఎస్‌బీఐ కొత్త చార్జీలను వర్తింపజేయనుంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌‌బీడీ) ఖాతాదారులకు ఈ రూల్స్ వర్తించనున్నాయి. కొత్త క్యాష్ విత్‌డ్రా రూల్స్ వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 

ఎస్‌బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్: 

  • క్యాష్‌ విత్‌‌డ్రా విషయంలో నాలుగుసార్లు లిమిట్ దాటిన తర్వాత ఎస్‌బీఐ లేదా ఇతర ఏటీఎంల్లో క్యాష్ విత్‌‌డ్రా చేస్తే రూ.15కు అదనంగా జీఎస్టీని కలిపి చెల్లించాల్సి ఉంటుంది. 
  • ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్కులను ఫ్రీగా పొందొచ్చు. ఆ తర్వాత ప్రతి పది చెక్‌లకు రూ.40, అదనంగా జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. 
  • ప్రతి 25 చెక్‌లకు రూ.75తోపాటు జీఎస్టీని కూడా చెల్లించాలి. 
  • అత్యవసరంగా చెక్ బుక్ పొందాలనుకుంటే రూ.50తోపాటు అదనంగా జీఎస్టీని కట్టాలి. అయితే ఈ రూల్ నుంచి సీనియర్ సిటిజన్స్‌ను ఎస్‌బీఐ మినహాయింపును ఇచ్చింది.