- ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 600 శాఖలను ప్రారంభించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) యోచిస్తోంది. పెద్ద నివాస టౌన్‌షిప్‌లతో సహా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు.
ఈ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరంలో 137 శాఖలను ప్రారంభించింది. ఎస్‌బీఐ నెట్వర్క్ మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 22,542 బ్రాంచులకు చేరింది. ఈ బ్యాంకుకు 65 వేల ఏటీఎంలు, 85 వేల మంది బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు.
తాము సుమారు 50 కోట్ల మంది కస్టమర్లకు సేవలందిస్తున్నామని, ఎస్బీఐని అత్యుత్తమ బ్యాంకుగా మార్చడం తన ప్రయత్నమని శెట్టి అన్నారు. డిపాజిటర్ల కోసం రికరింగ్ డిపాజిట్, సిప్ కాంబో ఉత్పత్తితో సహా వినూత్న ఉత్పత్తులతో ముందుకు రావాలని ఆలోచిస్తున్నామని వివరించారు.