
- జిల్లా ఎస్పీని ఆదేశించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య
మిర్యాలగూడ, వెలుగు : ఇరు కుటుంబాల మధ్య వివాదం నేపథ్యంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొత్తపేట తండా యువకుడు సాయి సిద్ధూ నాయక్ పై వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కులం పేరుతో దూషించాడని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఎస్పీని ఆదేశించారు. ఆదివారం కొత్తపేట తండాలో విచారణ చేపట్టారు. ప్రజలను కాపాడాల్సిన ఎస్ఐ ఈ విధంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు.
సాయి సిద్ధూ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయటంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాథోడ్ రాంబాబు, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి శశికళ, గిరిజన సంక్షేమ అధికారి చత్రు నాయక్, డీఎస్పీ రాజ శేఖర్ రాజు, ఎమ్మార్వో జవహర్ లాల్, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం అధ్యక్షుడు ధీరావత్ రవి నాయక్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ధీరావత్ శ్రీను నాయక్ ఉన్నారు.