సుప్రీంకోర్టు వంట మనిషి బిడ్డకు అమెరికా వర్సిటీలో సీటు

సుప్రీంకోర్టు వంట మనిషి బిడ్డకు అమెరికా వర్సిటీలో సీటు

న్యూఢిల్లీ: అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ చేయడానికి ఎంపికైన సుప్రీంకోర్టులోని వంట మనిషి బిడ్డను చీఫ్ ​జస్టిస్ ​ఆఫ్​ఇండియా డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు జడ్జిలు బుధవారం ఘనంగా సన్మానించారు. సుప్రీంకోర్టులో వంట మనిషిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ సమాల్ బిడ్డ ప్రగ్యా.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, మిచిగాన్ విశ్వవిద్యాలయాలలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ కు ఎంపికైంది. ఆమె ఆ రెండింటిలో ఏదో ఒక యూనివర్సిటీలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించనుంది. కాగా, ఈ విషయం తెలుసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ బుధవారం న్యాయమూర్తుల లాంజ్ లో యువ అడ్వొకేట్, లా రీసెర్చర్ ​ప్రగ్యాను అభినందించి, స్వీట్లు అందించారు. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ సంతకం చేసిన భారత రాజ్యాంగంపై మూడు పుస్తకాలను సీజేఐ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రగ్యా ఈ స్థాయికి రావడానికి ఎన్ని సవాళ్లు అధిగమించిందో తెలుసని, ఆమెకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు తాము అందిస్తామని ఆయన తెలిపారు. అలాగే, ఆమె దేశానికి సేవ చేయడానికి తిరిగి రావాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇతర న్యాయమూర్తులు ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వంట మనిషి అజయ్ కుమార్ సమాల్ దంపతులను కూడా సీజేఐ సన్మానించారు. దీంతో వారు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రగ్యా మాట్లాడుతూ.. సీజేఐ డీవై చంద్రచూడ్ తనకు స్ఫూర్తి అని పేర్కొంది. ఆయన యువ లాయర్లను ఎంతగానో ప్రోత్సహిస్తారని, అతని మాటలు రత్నాల్లా ఉంటాయని తెలిపింది.