
రిపబ్లిక్ టీవీ అధినేత ఆర్నాబ్ గోస్వామికి బెయిల్ మంజూరైంది. 2018లో ఆత్మహత్యకు పాల్పడిన కేసులో రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి హస్తం ఉందంటూ అతనికి అత్యవసర బెయిల్ ఇచ్చేందుకు బొంబాయి హైకోర్ట్ నిరాకరించింది. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ మరియు అతని తల్లి కుముద్ నాయక్ అలీబాగ్ వద్ద ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశారు. ఆ సూసైడ్ నోటులో తాము కాంకోర్డ్ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వివరించారు. రిపబ్లిక్ టీవీ అధినేత ఆర్నాబ్ గోస్వామితో పాటు ఆయన స్నేహితులు కాంకోర్డ్ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతలు తమకు 5కోట్లు బాకీ పడ్డారని, వాటిని తిరిగి చెల్లించడం లేదు కాబట్టే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితులు లేఖలో పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో మహరాష్ట్రపోలీసులు ఆర్నాబ్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పై ఆర్నాబ్ ముందస్తు బెయిల్ కోసం బొంబాయి హైకోర్ట్ ను ఆశ్రయించారు. కానీ అక్కడ ఆయనకు చుక్కెదురైంది. బెయిల్ ను తిరస్కరించింది.
దీంతో ఆర్నాబ్ సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీం కోర్ట్..మహరాష్ట్ర హైకోర్ట్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అంటే న్యాయాన్ని అపహాస్యం చేయడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలదనీ.. మహారాష్ట్ర ప్రభుత్వం టీవీ చర్చల్లో అర్నాబ్ చేసే వ్యాఖ్యల్ని పట్టించుకోవద్దని ధర్మాసనం సూచిస్తూ 50వేల పూచికత్తుతో ఆర్నాబ్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్ట్ తీర్పిచ్చింది.