సింగరేణిలో ఉద్యోగాలంటూ మోసం

సింగరేణిలో ఉద్యోగాలంటూ మోసం
  • సెక్యూరిటీ గార్డుపై దాడి 
  • 9 మంది నుంచి రూ.30 లక్షలు వసూలు 
  • ఫేక్​ అపాయింట్​మెంట్​ లెటర్లు ఇచ్చిన మహేశ్వర్​రావు    విచారణకు రాగా దాడి  

మందమర్రి​, వెలుగు : సింగరేణిలో ఉద్యోగాలు పెట్టిస్తానని మోసం చేశాడని ఆరోపిస్తూ  గురువారం మందమర్రి సింగరేణి ఎస్​అండ్​పీసీ సెక్యూరిటీ విభాగం ఆవరణలో సింగరేణి పర్మినెంటు సెక్యూరిటీ గార్డు మహేశ్వర్​రావుపై  జైపూర్​ మండలానికి చెందిన బాధితులు దాడి చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు రావడంతో గురువారం మహేశ్వర్​రావును పిలిపించి మందమర్రి ఏరియా సింగరేణి సీనియర్​సెక్యూరిటీ ఆఫీసర్​రవి సమక్షంలో ఎంక్వయిరీ చేశారు. విషయం తెలుసుకున్న జైపూర్​మండలం రసూల్​పల్లి, గుడిపల్లికి చెందిన బాధితులు సెక్యూరిటీ ఆఫీస్​కు వచ్చి తమ డబ్బులు తిరిగివ్వాలని మహేశ్వర్​రావును నిలదీశారు. సహనం కోల్పోయిన వారు అతడిని కొట్టారు. బాధితులు మాట్లాడుతూ జూన్​లో  సింగరేణిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, జూనియర్​అసిస్టెంట్​ఉద్యోగాలు ఇప్పిస్తానని మహేశ్వర్​రావు తొమ్మిది మంది నుంచి రూ.30 లక్షలు తీసుకున్నాడన్నారు.  జూన్​, జూలై నెలలో ఫేక్​జాయినింగ్ ​లెటర్లతో ఇద్దరికి మంచిర్యాలలో స్క్రాప్​ లారీల తనిఖీల పేరుతో రోడ్డుపై చెకింగ్​డ్యూటీలు వేశాడన్నారు. అనుమానంతో ఆగస్టు 19న మందమర్రి సింగరేణి సెక్యూరిటీ డిపార్ట్​మెంటులో ఆరా తీస్తే ఫేక్​ అపాయింట్​మెంట్ లెటర్లుగా తేలిందన్నారు.

దీంతో సెక్యూరిటీ ఆఫీసర్ రవికి ఫిర్యాదు చేశామన్నారు. అదే రోజు డబ్బులు తిరిగిస్తానని బాండ్​పేపర్​రాసివ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. మూడు నెలల గడిచినా డబ్బులివ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడని, కలర్​ జిరాక్స్​ చెక్కులు ఇచ్చాడని ఆరోపించారు. గురువారం ఎంక్వయిరీ కోసం సెక్యూరిటీ ఆఫీసుకు​ వస్తున్నాడని తెలిసి అడిగేందుకు ఇక్కడి వచ్చామన్నారు. మరోవైపు ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసిన పలు కేసుల్లో ఇదివరకే కోల మహేశ్వర్​రావుపై మందమర్రి, రామకృష్ణాపూర్​, మంచిర్యాల, నస్పూర్​ పోలీస్​స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పోలీసులు పీడీ యాక్ట్​ పెట్టి జైలుకు కూడా పంపించారు.  సింగరేణి సంస్థ సస్పెండ్​ చేసింది. తాను ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని మహేశ్వర్​రావు వివరణ ఇచ్చారు. దాడిపై తమకు మహేశ్వర్​రావు నుంచి ఫిర్యాదు అందిందని మందమర్రి ఎస్సై చంద్రకుమార్​చెప్పారు. బాధితులను సంబంధిత జైపూర్ ​పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు చెప్పారు.