రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసాలు

రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసాలు

జైలులో స్కెచ్‌‌.. ఏజెంట్లతో ట్రాప్‌‌
ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షలు వసూలు
ఫేక్ లెటర్లతో 6 నెలల ట్రైనింగ్‌‌, 18 వేలు స్టైఫండ్‌‌
ప్రధాన నిందితుడు సహా ఆరుగురి అరెస్ట్, పరారీలో 17 మంది


|హైదరాబాద్‌‌ : రైల్వే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. ఏకంగా సెంటర్లు పెట్టి ట్రైనింగ్‌‌, అపాయింట్‌‌మెంట్‌‌ లెటర్లు ఇస్తున్న ఈ గ్యాంగ్‌‌లో ఆరుగురిని వెస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రూ.15.3 లక్షల నగదు, 70 కంప్యూటర్లు, ఫేక్​స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 17 మంది కోసం గాలిస్తున్నారు. మంగళవారం బషీర్‌‌‌‌బాగ్‌‌లోని సిటీ కమిషనరేట్‌‌లో అడిషనల్ సీపీ ఏఆర్‌‌‌‌ శ్రీనివాస్‌‌, జాయింట్‌‌ సీపీ గజరావ్ భూపాల్‌‌, టాస్క్‌‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌‌రావు కేసు వివరాలు వెల్లడించారు.రాజేంద్రనగర్‌‌‌‌ ఉప్పర్‌‌‌‌పల్లికి చెందిన మహ్మద్ సనాఉల్లా (35) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం యత్నించాడు. రూ.6 లక్షలు చెల్లించి అక్షయ్‌‌ సింగ్‌‌ అనే మీడియేటర్‌‌‌‌ ద్వారా పాట్నలోని ఎఫ్‌‌సీఐలో జాయిన్ అయ్యాడు. చేరిన తర్వాత టెంపరరీ జాబ్‌‌గా గుర్తించి తను మోసపోయానని తెలుసుకున్నాడు. తిరిగొచ్చి మరో ఉద్యోగం కోసం యత్నించి రూ.5 లక్షలు కోల్పోయాడు. దీంతో తను కూడా మోసాలతో డబ్బులు సంపాదించాలనుకున్నాడు. కరోనా ఫస్ట్‌‌ వేవ్‌‌ టైమ్​లో పోలీసు స్టాంప్స్ తయారు చేసి ఫేక్ ఎమర్జెన్సీ పాస్‌‌లు ఇచ్చాడు. ఈ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు చంచల్‌‌గూడ జైలుకు పంపించారు. అక్కడ ఉద్యోగాల పేరుతో మోసాలు చేసి రిమాండ్‌‌లో ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన పాలెం అశోక్‌‌కుమార్‌‌‌‌ రెడ్డి(34)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో చీటింగ్ చేయాలని ప్లాన్ చేశారు. బయటకు వచ్చాక ఓ గ్యాంగ్‌‌ ఏర్పాటు చేశారు.

ఇన్‌‌కమ్‌‌టాక్స్‌‌ సర్వీసెస్‌‌ పేరుతో ఆఫీస్‌‌  

మాసబ్‌‌ట్యాంక్‌‌లో ఇన్‌‌కమ్‌‌టాక్స్‌‌ సర్వీసెస్‌‌ పేరుతో ఆఫీస్ తెరిచారు. క్యాబిన్స్, 40కి పైగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. ఏపీ పాలకొల్లుకు చెందిన ఎ.వీరచైతన్య(23), విజయవాడకు చెందిన జి.అర్జున్‌‌ రావు(34) కె.రఘువీర్‌‌‌‌(28) టి.అనిల్‌‌కుమార్‌‌‌‌(36)ను స్టాఫ్‌‌గా నియమించారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకలో ఏజెంట్లను పెట్టుకొని ఇన్​కమ్ టాక్స్‌‌, కస్టమ్స్, రైల్వేజాబ్స్‌‌ ఇప్పిస్తామని నిరుద్యోగులను ట్రాప్ చేశారు.

ఫోర్జరీ లెటర్లతో ట్రైనింగ్‌‌
ట్రాప్‌‌లో చిక్కిన వారి నుంచి రూ.4 లక్షలు వసూలు చేశారు. ఇంటర్వ్యూలు నిర్వహించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో అపాయింట్‌‌మెంట్‌‌ లెటర్స్‌‌ ఇచ్చారు. ఆరు నెలలు ట్రైనింగ్‌‌ కూడా ఇచ్చారు. ట్రైనింగ్ టైమ్​లో ఒక్కో అభ్యర్థికి రూ.18 వేలు స్టైఫండ్‌‌ ఇచ్చారు. ఇలా ఏడాదిలో 79 మందిని మోసం చేశారు. రైల్వేలో గ్రూప్‌‌–సీ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరి నుంచి వసూలు చేశారు. నేషనల్ సాయిల్ కన్జర్వేషన్ అండ్ సాలినైజేషన్‌‌ బోర్డు(ఎన్‌‌ఎస్‌‌డీఎస్‌‌బీ.ఓఆర్‌‌‌‌జీ) పేరుతో వెబ్‌‌సైట్ సృష్టించారు. దాని ద్వారా ఉద్యోగాలకు అప్లికేషన్స్ స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో అప్లికేషన్‌‌కు రూ.500 వసూలు చేశారు. ఇలా 1420 మందిని ట్రాప్ చేశారు. సెలెక్ట్‌‌ చేశామని ఓరల్‌‌ ఇంటర్యూలకు రావాలని వాళ్లందరికి మెసేజ్‌‌లు పంపించారు. ఇంటర్య్వూ కోసం వచ్చిన వారి నుంచి అందినకాడికి వసూలు చేశారు.

ఇలా దొరికారు
బాధితుల ఫిర్యాదులో పోలీసులు నిఘా పెట్టారు. ఇన్‌‌కమ్‌‌ టాక్స్‌‌ జాబ్‌‌ కోసం ఓ ఎస్సైని పంపించి ఆపరేషన్స్ గుర్తించారు. సోమవారం రాత్రి రెయిడ్స్ చేసి ప్రధాన నిందితుడు మహ్మద్ సనాఉల్లా, పాలెం అశోక్‌‌కుమార్‌‌‌‌ రెడ్డి, వీరచైతన్య, అర్జున్‌‌ రావు, రఘువీర్‌‌, అనిల్‌‌కుమార్‌‌‌‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ట్రైనర్స్‌‌ అంజలి, శిరీష్‌‌తో పాటు మరో 15 మంది ఏజెంట్స్‌‌ కోసం గాలిస్తున్నారు.