కొత్త ఓటర్ నమోదుకు షెడ్యూల్ రిలీజ్​.. జూన్ 6 వరకు ఇంటింటి సర్వే

కొత్త ఓటర్ నమోదుకు షెడ్యూల్ రిలీజ్​.. జూన్ 6 వరకు ఇంటింటి సర్వే
  • ఆగస్టు 2న ముసాయిదా జాబితా
  • అక్టోబర్ 4 న ఫైనల్ లిస్ట్

నల్గొండ, వెలుగు : తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ రిలీజ్​ చేసింది. ప్రతి ఏడాది జనవరిలో జరిగే ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ముందుకు జరిపింది. తెలంగాణ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎలక్షన్లు జరగనున్నాయి. దీంతో ఈ ఐదు స్టేట్స్​లో స్పెషల్​ సమ్మరీ రివిజన్​ చేపట్టాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ ఏడాది అక్టోబర్ ఒకటో​తేదీనాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కొత్తగా ఓటు హక్కు కల్పించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25 నుంచి జూన్​23 వరకు బూత్​ లెవల్​ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఓటరు జాబితాను పరిశీలిస్తారు. చనిపోయిన, వలస వెళ్లిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తారు. జూన్​ 24 నుంచి జులై 27 వరకు పోలింగ్​స్టేషన్లను క్రమబద్ధీకరిస్తారు. ప్రతి పోలింగ్​ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు మించకుండా పోలింగ్​ స్టేషన్​ పరిధి నిర్ణయిస్తారు. దీంతో పాటే కొత్త పోలింగ్​స్టేషన్ల గుర్తింపు కూడా చేపడుతారు. జులై 25 నుంచి 31 వరకు ఓటరు జాబితాకు సంబంధించిన సప్లిమెంట్స్​ ప్రక్రియ చేపడతారు. పురుషులు, మహిళలు, జనాభా తదితర వివరాలన్నింటినీ క్రోడీకరిస్తారు. కుటుంబ సభ్యులందరికీ ఒకే పోలింగ్​స్టేషన్​ పరిధిలో ఓటు కల్పించేలా జాబితా సవరిస్తారు.

ఆగస్టు 2న ముసాయిదా జాబితా..

ఈ ఏడాది జనవరి 5న ఫైనల్​ ఓటరు జాబితా ప్రకటించారు.  దీని ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్లు 2 కోట్ల 99 లక్షల 77 వేల 659 మంది ఉన్నా రు. వీరిలో పురుషులు కోటీ 50 లక్షల 50 వేల 464 మంది, మహిళలు కోటీ 49 లక్షల 25 వేల 243 మంది, ఇతరులు 1,952 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ప్రతి మూడు నెలలకోసారి కొత్త ఓటర్ల జాబితా రూపొందిస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఒకటో విడత ముగిసింది. రెండో విడత జులై 7 వరకు కొనసాగుతుంది. తాజాగా ఎన్నికల సంఘం షెడ్యూల్​ ప్రకటించిన నేపథ్యంలో అక్టోబర్ 1 వరకు కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని స్పీడప్​ చేస్తామని ఆఫీసర్లు తెలిపారు. ఒక నెలలో రెండు శనివారాలు, ఆదివారాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం బూత్​ లెవల్​లో చేపడ్తారు. స్పెషల్​ క్యాంపెయిన్​ డేట్లను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియ ముగిశాక ముసాయిదా ఓటరు జాబితాను ఆగస్టు 2న ప్రకటిస్తారు. ఈ జాబితా పైన అభ్యంతరాలు, ఫిర్యాదులు ఆగస్టు 31వ తేదీ వరకు స్వీకరిస్తారు. వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను సెప్టెంబర్​ 22లోగా పరిష్కరిస్తారు. అనంతరం కొత్త ఓటర్ల లిస్టులు ముద్రించి, తుది ఓటరు జాబితాను అక్టోబర్​ 4న ప్రకటిస్తారు.

బోగస్ ఓటర్లపై చర్యలు

బోగస్​ఓటర్లపై ఎన్నికల సంఘానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రతి మూడు నెలలకోసారి కొత్త ఓటర్లను చేర్చుకున్నట్టుగానే, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి వారం జిల్లా స్థాయిలో మీటింగులు పెడ్తున్నారు. కొత్త ఓటర్లు, తొలగించిన ఓటర్ల జాబితాను పొలిటికల్​పార్టీలకు ఇవ్వడంతోపాటు, వాళ్ల నుంచి వచ్చే అభ్యంతరాలను వెంటనే పరిశీలిస్తున్నారు. ఎన్నికలు జరిగే టైంలో బోగస్​ ఓటర్ల ప్రస్తావన తలెత్తకుండా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితాపైన సంతకాలు తీసుకుంటున్నారు.