బీఆర్ఎస్ ​ప్రోగ్రాంలకు డప్పు కొట్టం

బీఆర్ఎస్ ​ప్రోగ్రాంలకు డప్పు కొట్టం

ఇందల్వాయి, వెలుగు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ  బీఆర్ఎస్​పార్టీకి ప్లస్ ​అవుతాయనుకుంటున్న పథకాలే కొన్ని చోట్ల మైనస్​గా మారుతున్నాయి. దళితుల అభివృద్ధి కోసం ప్రారంభించామని చెప్తున్న దళితబంధు పథకానికి నిరసన సెగలు తగులుతున్నాయి. ​నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన ఎస్సీలు  గురువారం బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ఇటీవల గ్రామానికి చెందిన ఏడుగురిని దళిత బంధుకు ఎంపిక చేశారు. 

పేదలకు కాకుండా తమకు నచ్చిన వారికే దళితబంధు ఇచ్చారని బాధితులు ఆగ్రహంగా ఉన్నారు. గ్రామంలో సమావేశం నిర్వహించి బీఆర్ఎస్​ కార్యక్రమాలకు డప్పులు కొట్టబోమని స్పష్టంచేశారు. అలాగే ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా ఎవరూ పాల్గొనకూడదని తీర్మానం చేసుకున్నారు. మరోవైపు గ్రామానికి చెందిన మాల కులస్తులు స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​ని కలిసి, లబ్ధిదారులను మార్చాలని మెమోరాండం అందజేశారు. మార్పుపై పునరాలోచన చేస్తామని ఎమ్మెల్యే హమీ ఇచ్చినట్లు వారు చెప్పారు.