సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు కోసం కృషి చేయాలి : నర్సింహారెడ్డి

సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు కోసం కృషి చేయాలి : నర్సింహారెడ్డి
  • ఎంఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు కోసం కృషి చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి కోరారు. ప్రభుత్వ స్కూళ్లపై పేరెంట్స్, స్టూడెంట్లలో నమ్మకం పెరిగేలా ఎంఈఓల పనితీరు ఉండాలని సూచించారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో తొలి విడతలో మూడు రోజుల పాటు ఎంఈఓలకు నిర్వహించే శిక్షణ క్లాసులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో స్కూళ్ల అభివృద్ధికి ఎంఈఓలు చాలా కీలకమని చెప్పారు. నిత్యం స్కూళ్లను సందర్శిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కృషి చేయాలన్నారు.

ప్రస్తుతం మండలానికి ఒక ఎంఈఓ ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని విద్యాశాఖ పరిధిలోని 1.22 లక్షల మంది టీచర్లకు ఐదు రోజుల ట్రైనింగ్ క్లాసులను ఈ నెల 13 నుంచి ప్రారంభించామన్నారు. ఈ టీచర్లకు 5,605 మంది రిసోర్స్ పర్సన్స్ శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంచేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్​సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, ఆర్జేడీలు విజయలక్ష్మి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.