హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా..ఆరుగురు చిన్నారులు మృతి

హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా..ఆరుగురు చిన్నారులు మృతి
  • 20 మంది పిల్లలకు గాయాలు, ఇద్దరి పరిస్థితి సీరియస్​
  • డ్రైవర్ మద్యం తాగి నడపడంతో ప్రమాదం
  • రంజాన్ రోజు స్కూల్ నడిపిన యాజమాన్యం.. ప్రిన్సిపాల్, డ్రైవర్, బస్సు ఓనర్​ అరెస్టు

చండీగఢ్​:  హర్యానాలో ఓ స్కూల్ బస్సు బోల్తాపడి ఆరుగురు చిన్నారులు మృతిచెందారు.  ఈ ఘోర ప్రమాదంలో మరో 20 మంది పిల్లలు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి సీరియస్​గా ఉంది. మహేంద్రగఢ్‌‌ జిల్లాలోని ఉన్హాని గ్రామం వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. గురువారం రంజాన్ పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు ఉన్నప్పటికీ జీఎల్ పబ్లిక్ స్కూల్‌‌ యాజమాన్యం సెలవు ప్రకటించకుండా క్లాసులు నిర్వహించింది. దీంతో ఉదయమే పిల్లలు స్కూల్ బస్సులో బడికి బయల్దేరారు. ఈ క్రమంలో ఉన్హాని గ్రామానికి సమీపంలోకి రాగానే అక్కడున్న ఓ టర్నింగ్​లో బస్సు అదుపు తప్పింది. 

దీంతో ఆ బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టి బోల్తా పడిపోయింది. ప్రమాద సమయంలో ఫోర్త్​ క్లాస్​ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుతున్న 40 మంది పిల్లలు ఆ బస్సులో ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన పిల్లల్లో ఇద్దరి పరిస్థితి సీరియస్​గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం రోహ్​తక్ లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగగానే డ్రైవర్ బస్సులోంచి దూకి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అతను మద్యం మత్తులో బస్సు నడిపినట్లు తెలిసిందని చెప్పారు. అలాగే బస్సుకు ఫిట్​నెస్ సర్టిఫికెట్​ గడువు కూడా 2018లోనే ముగిసిందన్నారు. 

వెహికల్ పేపర్స్ కూడా సరిగా లేవని తెలిపారు. స్కూలు ప్రిన్సిపాల్, డ్రైవర్, బస్సు యజమానిని అరెస్టు చేశామన్నారు. ఫిట్​నెస్​ లేకుండా నడిపిస్తున్న బస్సులను అడ్డుకోవడంలో ఫెయిల్ అయిన స్థానిక రోడ్డురవాణా అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హర్యానా సీఎం నాయబ్​ సైనీ ప్రమాదంపై మీడియాతో మాట్లాడుతూ స్థానిక యంత్రాంగం బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నదని తెలిపారు. సెలవు రోజున స్కూల్​ ఎందుకు నడిపిస్తున్నారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీమా త్రిఖా తెలిపారు. స్కూల్​కు షోకాజ్ నోటీసు ఇచ్చామని చెప్పారు. ఈ దుర్ఘటనకు  స్కూల్ మేనేజ్​మెంట్, ​డ్రైవర్‌‌, బస్సు యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.