మోగిన బడి గంట.. సమస్యల వెల్​కం

మోగిన బడి గంట.. సమస్యల వెల్​కం

హైదరాబాద్/కంటోన్మెంట్/పద్మారావునగర్/మంచాల/గండిపేట/మహేశ్వరం, వెలుగు:
సమ్మర్​హాలిడేస్ ముగియడంతో సోమవారం గ్రేటర్ పరిధిలోని అన్ని స్కూళ్లు ఓపెన్​అయ్యాయి. 2023 – 24 విద్యా సంవత్సరంలో హాలిడేస్​పోను మొత్తం 229 రోజులు స్కూళ్లు నడుస్తాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. గ్రేటర్ ​వ్యాప్తంగా మొదటిరోజు దాదాపు 45 శాతం మంది స్టూడెంట్లు క్లాసులకు హాజరయ్యారు. ఎప్పటిలాగే ప్రభుత్వ బడుల్లో టాయిలెట్స్, తాగునీరు లేక పిల్లలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 691 గవర్నమెంట్​స్కూళ్లు ఉండగా వాటిలో లక్షా14 వేల మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు.   మన బస్తీ – మన బడి ఫేజ్1 కింద 261 స్కూళ్లను మాత్రమే ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేప్టటినా వాటిలో కూడా అరకొర వసతులే ఉన్నాయి. 

తాడ్ బండ్ స్కూల్​ గేటుకు తాళం

సికింద్రాబాద్ ​కంటోన్మెంట్​పరిధిలోని తాడ్ బండ్ గవర్నమెంట్​స్కూల్ కు బోర్డు అధికారులు తాళాలు వేయడం వివాదస్పదంగా మారింది. సోమవారం స్కూళ్లు ప్రారంభం కావడంతో పొద్దున్నే టీచర్లు డ్యూటీకి వచ్చారు. గేటుకు తాళం వేసి ఉండటంతో ఉన్నతాధికారులకు ఫోన్​చేసి చెప్పారు. విద్యాశాఖ అధికారులు వెంటనే కంటోన్మెంట్​బోర్డు అధికారులను సంప్రదించగా, తాళాలు తామే వేశామని, స్థలం తమ ఆధీనంలో ఉందని, లోపలికి వెళ్లడానికి వీలులేదని చెప్పినట్లు టీచర్లు పేర్కొన్నారు. చివరికి ఏమైందో ఏమో.. బోర్డు అధికారులే తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లొచ్చని చెప్పడంతో మధ్యాహ్నం 1.30గంటలకు టీచర్లు తాళాలు పగలగొట్టి  స్కూల్​లోనికి వెళ్లారు.

రావిర్యాలలో బడిబాట

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల జడ్పీహెచ్ఎస్​లో సోమవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల చదువు, రైతుల వ్యవసాయం ఒక్కటేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్​ప్రభుత్వం గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. జడ్పీ చైర్ పర్సన్​అనితారెడ్డి, జిల్లా విద్యాధికారి సుశీందర్​రావు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. మంచాల మండలం చీదెడ్ లోని కేంద్ర ప్రాథమికొన్నత పాఠశాల భవనాన్ని ఇటీవల జేడీ ఫౌండేషన్, మరికొందరి సహకారంతో పునర్నిర్మాణం చేసి మెరుగులుదిద్దారు. సోమవారం నిర్వహించిన ప్రారంభోత్సవంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. జడ్పీటీసీ సభ్యురాలు నిత్య, సర్పంచ్ రమాకాంత్​ రెడ్డి, టీచర్లు పాల్గొన్నారు. 

ఫిట్​నెస్ లేని 6 స్కూల్​ బస్సులు సీజ్

గండిపేట: ఆరాంఘర్, ఉప్పర్​పల్లి చౌరస్తాలో సోమవారం  రాజేంద్రనగర్ ఆర్టీవో అధికారులు స్కూల్​బస్సులు, వ్యాన్లను  తనిఖీ చేశారు. ఫిట్​నెస్​ సరిగా లేని ఆరు స్కూల్ బస్సులను సీజ్ చేశారు. బస్సులకు పూర్తి ఫిట్​నెస్​ ఉండాలని, డ్రైవర్​కు లైసెన్స్ తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.